Telangana Paddy Procurement Issue: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) లోక్ సభ (Loksabha)లో స్పందించారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని తేల్చి చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిల్వలు, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కేంద్రం ధాన్యం కొనేదాకా పోరాడతామని చెప్పింది. అందుకోసం తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఉండి కేంద్ర మంత్రిని కలవాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal In Loksabha)మరోసారి కుండబద్దలు కొట్టినట్లుగా ధాన్యం కొనబోమని తేల్చి చెప్పేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ (Paddy Procurement Issue) ఢిల్లీకి చేరింది. నలుగురు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం (మార్చి 23) రాత్రి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. యాసంగి పంట కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే, ఆయనకు ఉన్న ఇతర ప్రోగ్రామ్స్, ముందస్తు షెడ్యూల్స్‌ను బట్టి తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చే అంశంపై పరిశీలిస్తామని పీయూష్ సిబ్బంది చెప్పినట్లు సమాచారం.


ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, తెలంగాణ నుంచి వచ్చే పూర్తి ధాన్యాన్ని కేంద్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కేంద్రాన్ని కోరుతోంది. ఈ యాసంగిలో వచ్చే ప్రతి ధాన్యం గింజ కేంద్రమే సేకరించాలని పీయూష్ గోయల్‌ కలిసి తెలంగాణ మంత్రులు కోరదామని అనుకున్నారు. ఈ లోపే లోక్ సభలో తాజా ప్రకటన వెలువడింది.


పార్టీ ఎంపీలతో కలిసి మంత్రుల బృందం ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవనుంది. ఇప్పటికే అపాయిట్‌మెంట్లను కోరారు. మూడు రోజుల పాటు మంత్రులు ఢిల్లీలోనే ఉండనున్నారు. పంజాబ్‌ తరహాలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే, ఉద్యమం చేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు (TRS) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లే, తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలు మూసివేస్తానన్న సీఎం, ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు.