సరికొత్త ఆవిష్కరణలకు చదువుతో పనేముంది.. వయస్సుతో ఏం అవసరం ఉంది.. అంటారు తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన కడియపు శ్రీనివాస్ ను చూసినవారంతా.. అవును అతను ఏమీ చదువుకోక పోయినా ఏదో చేయాలన్న తపన.. ఇద్దరు పిల్లలు తండ్రి అయినా కుర్రాడిలా ఆలోచించే తత్వం.. ప్రతీది సూక్ష దృష్టితో పరిశీలించగల తత్వం.. తన వృత్తిలో నైపుణ్యం.. వెరసి ఆయనను ఓ ఆవిష్కరణ వైపునకు నడిపించాయి.


ఎటువంటి విద్యుత్తు అవసరం లేకుండా పూర్తిగా చెక్కతో తయారు చేసిన ట్రెగ్ మిల్‌ను తయారు చేశాడు.. శ్రీనివాస్ అనే కార్పెంటర్. పేరుకు కార్పెంటర్ అయినా శ్రీనివాస్ తయారు చేసిన ట్రెడ్ మిల్ చూస్తే  తనలోని నైపుణ్యంతోపాటు సాంకేతిక ఆలోచన విధానాన్ని పరిశీలిస్తే అభినందించకుండా ఉండలేం. ఈ ఆవిష్కరణ తన కుమారుడి ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అది తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. ట్విటర్‌లో అభినందిస్తూ పోస్ట్ చేసేలా చేసింది.


తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లలపుంత కాలనీకు చెందిన కడియపు శ్రీనివాస్ వృత్తి రీత్యా వడ్రంగి. స్థానికంగా ఈయన కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఈయన ఏమీ చదువుకోలేదు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బీకాం కూడా చదువుకున్నాడు. కుమార్తెకు వివాహం అయ్యింది. ఓసారి ఓ ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తుండగా విద్యుత్తుతో నడిచే ట్రెడ్ మిల్ శ్రీనివాస్ కంటపడింది. అది చాలా ఖరీదు అని తెలియడంతో తానే చెక్కతో ఓ ట్రెడ్ మిల్ తయారు చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రాత్రిపూట ఇంటివద్ద ట్రెడ్ మిల్ తయారీకి పూనుకున్నాడు. 


వారం రోజుల్లో తాను అనుకున్న ఉడెన్ ట్రెడ్ మిల్ తయారు చేశాడు. ఆఫ్ట్ ఫ్లై ఉడ్, టేకు బద్దలు, 60 అంగుళుంన్నర బేరింగ్ లు, 60 వరకు సోఫా బెల్టులు, 60 బోల్టులు ఈ ఉడెన్ ట్రెడ్ మిల్ తయారీకి ఉపయోగించానని శ్రీనివాస్ చెబుతున్నాడు. దీనికి ఖర్చు తన లేబర్ ఖర్చు కాకుండా రూ.8 వేలు అయ్యిందని తెలిపారు. చెక్కతో తయారు చేయడం వల్ల కొంత సౌండ్ వస్తుందని, అదికూడా తగ్గించేందుకు, మరింత మెరుగైన పని తీరుతో పని చేసేందుకు కొన్ని మార్పులు చేసే పనిలో ఉన్నానని శ్రీనివాస్ తెలిపారు.






తన ఆవిష్కరణను తన కుమారుడు సోషల్ మీడియాలో పెట్టాడని, అది కాస్త వైరల్ అవ్వడంతో స్వయంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించడం తనకు మరచిపోలేని సంతోషాన్ని ఇచ్చిందని శ్రీనివాస్ చెబుతున్నాడు. అదే విధంగా తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తనకు ఫోన్ చేశారని, తన వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. చెక్క ట్రెడ్ మిల్ రూపొందించి మండపేటకు మంచి పేరు తీసుకొచ్చారని స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు శ్రీనివాస్‌ను అభినందిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.