Kishan Reddy On BRS Manifesto: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మాయమాటలు చెప్పి మోసం చేయడమే కేసీఆర్ నైజమని, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్దమయ్యాయని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని, కేజీ టూ పీజీ విద్య ఏమైందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. 24 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఏమైందని నిలదీశారు.
ప్రజలను మభ్యపెట్టే హామీలు
కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉచిత విత్తనాలు, ఎరువుల హామీ ఏమైందని, రేషన్ కార్డు ఇవ్వని సర్కారు సన్నబియ్యం ఇస్తామనటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, అమలుకు నోచుకోని హామీలు ఇస్తారని విమర్శించారు.
'కేసీఆర్ సకల జనుల ద్రోహి'
సీఎం కేసీఆర్ సకల జనుల ద్రోహి అని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ సొంత ఫ్యామిలీ పాలసీని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
విశ్వాసం లేని మ్యానిఫెస్టో
అటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాష్ జావదేకర్ కూడా స్పందించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఎవరికీ విశ్వాసం లేదని, అంతా బోగస్ అని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీలే కేసీఆర్ అమలు చేయలేదని అన్నారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.?. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారని జావదేకర్ మండిపడ్డారు.
త్వరలోనే బీజేపీ మ్యానిఫెస్టో
తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించగా, బీజేపీ కూడా మ్యానిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు, వృద్ధులు, రైతులు, యువత, అన్ని వర్గాలు లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ్యానిఫెస్టోలు ఉండగా, బీజేపీ సైతం అన్నింటిని పరిగణలోకి తీసుకుని మ్యానిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
కేసీఆర్ హామీలివే
బీపీఎల్ కుటుంబాలకు కేసీఆర్ బీమా పేరుతో ఎల్‌ఐసీ ద్వారా రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు నెలకు రూ.3 వేల భృతితో పాటు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పగా.. కేసీఆర్ దానికి పోటీగా రూ.400కే అందిస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ మహిళలకు నెలకు రూ.2,500 పించన్ ఇస్తామని అనగా.. కేసీఆర్ రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ రూ.4 వేలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వగా.. కేసీఆర్ విడతల వారీగా పెన్షన్ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.