Double Bedroom Housing scheme:
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి లక్ష్యంగా ఎన్నికలకు కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరం లోని నిరు పేదలకు ఎన్నికల వేళ వరాల జల్లు కురిపించారు.
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ మహానగరంలో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రంలో వేల ఇండ్లను కట్టించి ఇచ్చామని వెల్లడించారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.... " మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం. అందులో 11 లక్షల మంది నిరాశ్రయులుగా ఉన్నారని తేలింది. ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయినవారు విడిపోతారు. కాబట్టి ఇండ్లు కట్టివ్వాలని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్నాం. గృహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల కొప్పున తీసుకుని ముందుకు పోతున్నాం. డబుల్ బెడ్రూం ఇండ్లకే ప్రభుత్వమే జాగాలు సమకూర్చి కట్టించి ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇల్లు లేదని బాధపోవాలి. ప్రతి ఒక్కరికి గూడు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి హైదరాబాద్‌లో ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో మరో లక్ష డుబల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం" అని కేసీఆర్ ప్రకటించారు.
గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది అని కేసీఆర్ తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధి ఇప్పటికే
జీహెచ్ఎంసీ పరిధిలోని 9 నియోజకవర్గాలకు చెందిన 19,020 మంది పేదలకు ఇండ్ల పట్టాలను అందజేశారు. తొలి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి డుబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేసిన విషయం తెలిసిందే. మూడో విడత లబ్ధిదారులతో కలుపుకొని ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 43,920 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేశారు.