కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ కంటే దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ తండ్రి వల్ల మంత్రి అయ్యారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. సగం సగం జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. శనివారం (జనవరి 14) హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రేపు (జనవరి 15) ప్రారంభం కాబోతున్న వేళ వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కూడా విమర్శించారు.
కొద్ది రోజుల క్రితం కేటీఆర్ సవాళ్లు
కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామని, కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ చెప్పారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా అని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. కిషన్ రెడ్డి పదవికి రాజీనామా చేసే దమ్ము లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడిలా కిషన్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ హాజరవుతారని అనుకుంటున్నాం - కిషన్ రెడ్డి
సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కాబోతున్న వేళ ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని ఆశిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక అని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ వ్యాప్తంగా 6వ వందేభారత్ రైలు. మొత్తంగా 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించాము. ప్రతి రైలుని ప్రధాని మోదీనే ప్రారంభిస్తారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ కలలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారు. రైల్వేలో సంచలన మార్పులు మాత్రమే కాకుండా ప్రధాని మోదీ తక్కువ ధరలకు మందులు, వ్యాక్సిన్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజల వద్దకే వైద్యం లక్ష్యంగా లక్షా యాభై వేల వెల్‌నెస్ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 1.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశాం. 2023 ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.