‘రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటుంటే టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టించావ్, భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉంటావనుకున్నావు. ఇప్పటివరకూ నా సున్నితత్వాన్ని చూశారు, ఇకపై వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం’ అంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. భోగి పండుగనాడు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 కాపీలను దహనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణాలను చూడలేదని, పోలీసులను సైతం వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ అధినేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. పండుగ పూట కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పండుగ పూట కూడా ఏడుపేనా చంద్రబాబు.. చిత్తూరు జిల్లాలోనే కాదు, కుప్పంలోనూ టీడీపీ జెండా పీకి పారేస్తాం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, ప్రజలు తమ వెంట ఉన్నంతవరకు వైసీపీ విజయాన్ని చంద్రబాబు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల పరిపాలనా కాలంలో హంద్రీనీవా పూర్తి చేయలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం వైఎస్ జగన్ సూచనలతో హంద్రీనీవాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై, తనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, కుట్రలు చేసే రాజకీయ నాయకుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు ఏడుపు ఎందుకంటే..
చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎప్పుడూ మెజార్టీ సాధించలేకపోవడమే చంద్రబాబు ఏడుపునకు కారణం అని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఓ వైపు అధికారం దక్కదన్న బాధ, మరోవైపు ఇక గెలిచే అవకాశం లేదన్న ఆలోచనలు చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ వైసీపీ జెండా పాతేస్తామని, ఇక ప్రజలకు ఏ సమస్యా ఉండదని జోస్యం చెప్పారు. తన బాధలను మొత్తం వైసీపీ చేసిన పనులుగా చిత్రీకరిస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ నాయకత్వానికి జై కొడతారని, అన్ని స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుందన్నారు.


ఎన్నికల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చంద్రబాబు మాట్లాడిన మాటల వింటే హాస్యాస్పదంగా ఉందని, 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అనేది చంద్రబాబుకు గుర్తుకు రావడం లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. మంచి రోజులు వచ్చిన సంగతి చంద్రబాబు మరిచి పోయారని, చంద్రబాబుకి ఆరోగ్యం బాగోలేక అల్జీమర్స్ ఎక్కువ కావడంతో 2019లో జరిగిన ఎన్నికలను మరిచి పోయారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలు ప్రజలకు అందుతుందని,‌మరిముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు చాలా మంది సీఎంగా ఉన్నా, ఏనాడు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు, రాష్ట్రంకు ఏం చేసాడని మాపై ఆరోపణలు చేస్తున్నారో అర్ధం‌ కావడం లేదన్నారు. పుంగనూరులో గడిచిన 10 రోజుల్లో వందల కేసులు పైగా పెట్టామని చంద్రబాబు మాట్లాడుతున్నారని, పుంగనూరులో టిడిపి నాయకులు రౌడీయిజం చేస్తే మేము చూస్తూ‌ ఉండి పోవాలా, పార్టీని అడ్డం పెట్టుకుని టిడిపి గుండాలు కార్యకర్తలు రాళ్లు రవ్వడం, కట్టెలు విసరడం, వాహనాలు ధ్వంసం చేయడం బండలు పగలగొట్టడం ఇలాంటి ఘటనలు చేస్తుంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేయకుండా చూస్తూ ఉండాలా టిడిపి నాయకులు ఇష్టానుసారం వదిలేస్తే మంచిది లేకుంటే పుంగనూరులో అరాచకం జరుగుతుందని కావాలని ముద్ర వేస్తున్నారన్నారు.. ఒక వ్యక్తిని రౌడీ, గూండా అని అభివర్ణించడం, ఒక ప్రాంతాన్ని గురించి మాట్లాడటం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటన్నారు. 2024లో కూడా YSRCP అధికారంలో ఉండగానే సంక్రాంతి పండుగ రోజున చంద్రబాబు ఏడ్చే రోజులు దగ్గర పడిందన్నారు. కుప్పంలో మాత్రమే 20వేల ఇండ్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిందన్నారు.