తిరుమల శ్రీవారికి టీవీఎస్ సంస్థ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, చెన్నైకి చెందిన సెల్వం శనివారం రూ.80 లక్షల విలువ చేసే ఏసీ సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను టీటీడీకి విరాళంగా అందించారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం దాత టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి తాళం చెవులను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఏసీతో ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. దాతలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.


శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుల్బర్గా ఎంపీ ఉమేష్ యాదవ్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


శ్రీవారి ఆలయం ముందు‌ భోగి మంటలు..
తిరుమలలో సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. నేడు భోగి పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించారు. వేకువజామున ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. దక్షణాయనం నుండి ఉత్తరాయణం మారిన తర్వాత మొదటిగా వచ్చే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు.


ఇక తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తున్నారు. గురువారం (జనవరి 12) రోజున 68,354 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 24,159 మంది తలనీలాలు సమర్పించగా, 3.59 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక టైం స్లాట్ టోకెన్లు‌ లేని సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది.. దీంతో స్వామి వారి సర్వ దర్శనంకు 12 గంటల సమయం‌ పడుతుంది..‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది..