Bandi Sanjay sensational comments on BRS merger with BJP | హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరెత్తితేనే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, కేసీఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా తమకు ఏ ప్రయోజనం ఉండదన్నారు. హైదరాబాద్ కోఠిలో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల్ని ప్రజలు చీదరించుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణాలు మాపీ కాని రైతులకు బ్యాంక్‌ల నుంచి ఎన్‌వోసీలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతుల కోసం బీజేపీ కొట్లాడుతుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. 


బీజేపీకి అంత ఖర్మ పట్టలేదు 
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తల్ని బండి సంజయ్ ఖండించారు. ‘బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఖాయమని, కానీ కాంగ్రెస్ లో కలిసి పోతుంది. అందువల్లే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలైంది, ఇప్పుడు మళ్లీ హస్తం పార్టీ గూటికే చేరుతున్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తులు, విలీనం చేసుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉంది. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 


రైతు రుణమాఫీ అమలుకాలేదని మండిపాటు


ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదు. రుణమాఫీ కావడంల లేదని, అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. 64 లక్షల మంది రైతులు లోన్ తీసుకుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల్ని రైతులు, ప్రజలు దహనం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే పార్టీల విలీనం అని డ్రామాలు ఆడుతున్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఎన్నికల సమయంలో 40 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో రూ.26 వేలు కోట్లు కేటాయించి, ఇప్పుడు  రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?’ అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.


అయితే, తెలంగాణ వ్యవసాయశాఖ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు అందరికీ రూ.2 లక్షల వరకు  రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వివరాలు సరిగ్గా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిన రైతులందరికీ మూడు విడతల్లో రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అర్హులై ఉండి ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి రైతులు తమ వివరాలు సమర్పించాలని సూచించారు. 


Also Read: KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు