హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దాదాపుగా భౌతిక దాడి జరిగే పరిస్థితి తలెత్తిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అది కూడా Z+ సెక్యూరిటీ ఉండే వ్యక్తికి సెక్యూరిటీ లోపం తలెత్తిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై త్వరలోనే రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. గతంలోనూ అసోం ప్రభుత్వం, సీఆర్‌పీఎఫ్‌ సైతం ఇదే విషయమై తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. హైదరాబాద్‌ ఎంజే మార్కెట్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం వేదికపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగించేందుకు సిద్ధం కాగా, టీఆర్ఎస్ కార్యకర్త మైక్‌ లాక్కునేందుకు ప్రయత్నించడం ఉద్రికత్తలకు దారితీసింది. 


అసలేం జరిగిందంటే.. 
నగరంలోని ఎంజే మార్కెట్‌ వద్ద గణేశ్‌ శోభాయాత్రలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్యర్యంలో మొజంజాహీ మార్కెట్‌ చౌరస్తా వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడారు. తరువాత హిమంత బిశ్వశర్మ మాట్లాడాల్సి ఉండగా.. ఒక్కసారిగా స్థానిక టీఆర్ఎస్ నేత నందు బిలాల్ వ్యాస్ స్టేజ్ పైకి దూసుకొచ్చారు. నందు బిలాల్ మైకు లాక్కునేందుకు ప్రయత్నించడంతో వెంటనే అక్కడున్న భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు అతడ్ని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్త నందు బిలాల్ ను అదుపులోకి తీసుకొని అబిడ్స్ రోడ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.  






రెచ్చగొట్టేలా మాట్లాడినందుకే అలా చేశాను.. 
పోలీస్ స్టేషన్ వద్ద టీఆర్ఎస్ నేత నందు బిలాల్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గ‌ణేశ్ ఉత్సవాల‌కు వ‌చ్చిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాజ‌కీయాలు మాట్లాడ‌టం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను దూషించినందుకే ఆయ‌న‌ను మాట్లాడ‌నివ్వకుండా అడ్డుకుకే ప్రయత్నం చేశానని వెల్లడించారు. హైద‌రాబాద్‌లో అసోం సీఎం శాంతి భ‌ద్రత‌ల‌కు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. తమ నేతను రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంటే బీజేపీ నేతలు హైదరాబాద్ కు వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని నందు బిలాల్ ఆరోపించారు.  


కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
టీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి క్రిశాంక్ మన్నె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ ఉన్నారని, కానీ  రోజంతా మా సీఎం కేసీఆర్‌ను తిట్టారంటూ మండిపడ్డారు. నేడు తెలంగాణ ప్రజలు గణేష్ నిమజ్జనం జరుపుకుంటూ బిజీగా ఉన్నారని, కానీ బీజేపీ నేతలు ఈ సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


 Also Read: Hyderabad News : హైదరాబాద్ ఎంజే మార్కెట్ లో ఉద్రిక్తత, అసోం సీఎం ఉన్న వేదికపై మైకు లాక్కునేందుకు ప్రయత్నించిన వ్యక్తి