TTD will now accept the letter from Telangana public representatives: తిరుమలలో తమ సిఫారసు లేఖలు అనుమతించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న డిమాండ్ ను టీటీడీ ఆలకించింది. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారించినట్లుగా తెలుస్తోంది. వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన చేయనుంది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించాలని కొంత కాలంగా డిమాండ్
కొద్ది రోజులుగా తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఆమోదించడం లేదని వివక్ష చూపిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఈ విషయంలో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించారు. మంత్రి కొండా సురేఖ కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఈ సిఫారసు లేఖల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఈ కారణంగా టీటీడీ చైర్మన్ తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడిన టీటీడీ చైర్మన్
ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుోకవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.
వారానికి రెండు లేఖల అనుమతి
వారానికి రెండు సిఫారసు లేఖల్ని అనుమతించేలా చూడాలని కోరడంతో ఆ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారు. ఈ లేఖలు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, 17 ఎంపీల లేఖలు చెల్లుబాటు అవుతాయి. మాజీ మంత్రులు, తర వీఐపీల లేఖలు మాత్రం చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవని అనుకోవచ్చు.