TTD Darshan Tickets for TSRTC passengers: హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సు (TSRTC)లో తిరుమలకు వచ్చే ప్రయాణికులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు వచ్చే భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మందికి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి
శ్రీవారి దర్శనానికి 72 గంటల లోపు కొవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసే తెలంగాణ భక్తులకు మాత్రమే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అందించనుంది. టీఎస్‌ఆర్టీసీలో తిరుమల ప్రయాణం క్షేమదాయకమని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తమ రాష్ట్రం నుంచి టీఎస్‌ఆర్టీసీలో తిరుమలకు వెళ్లే భక్తులకు ముందుగానే టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల ప్రయాణానికి రెండు రోజుల ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకొనేవారికి ఈ టికెట్లు కేటాయించనున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని కారణంగానే, కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ కోరుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఆర్టీసీ నుంచి మరిన్ని సేవలు
కార్గో, పార్శిల్ సేవల కోసం హైదరాబాద్ నగరంలో 25 ప్రదేశాలను గుర్తించినట్లు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పార్సల్‌లను తీసుకోవడానికి ప్రయాణికులు MGBS, JBS వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. జూన్ 6న ఈ కొత్త 25 కౌంటర్లు అందుబాటులోకి వస్తాయి. TSRTC, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర పర్యాటకాన్ని డెవలప్ చేసేందుకు పరస్పరం సహకరించుకోవడంపై సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పరస్పరం సహకారంతో రెండు విభాగాలకు ప్రయోజనం చేకూరనుంది.
టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ.. కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతుండటంతో ప్రజలు ఇప్పుడు ట్రావెల్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సహకారంతో హరిత హోటల్ చైన్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. తద్వారా రెండు కార్పొరేషన్‌లకు విజయం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: Tirumala No Plastic Zone : తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం - ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు ?