Medaram Jatara 2024: హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా, ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇదివరకే ఇంటి నుంచే మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించిన టీఎస్ ఆర్టీసీ.. భక్తుల కోసం మరో అడుగు ముందుకేసింది. ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని (Medaram Jatara Prasadam) భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందజేయనున్నారు.


ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర 
మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ (TSRTC) కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. https://rb.gy/q5rj68 లింక్‌ పై క్లిక్‌ చేసిగానీ లేదా పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇచ్చి ప్రసాదాన్ని పొందవచ్చు.


మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం 
మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. దీనిపై స్పందించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. మేడారం జాతర ప్రసాదం బుకింగ్‌ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తామని స్పష్టం చేశారు.. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని వెల్లడించారు. 


రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో మేడారం ప్రసాదం సేవ అందుబాటులో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.


మేడారం ప్రసాదం బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.


Also Read: Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు గుడ్‌న్యూస్ - ఆన్‌లైన్‌లోనూ మొక్కులు చెల్లించుకోవచ్చు