YCP leaders are demanding to continue Hyderabad as joint capital :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం  ఎన్నికలకు ముందు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు ఈ గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ రెడీ అయింది. ఆ  పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్..  రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వైవీ సుబ్బారెడ్డి ఈ డిమాండ్ వినిపించారు. 


ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలన్న వైవీై సుబ్బారెడ్డి 


వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నాని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.   ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జూన్‎తో రాజధాని గడువు ముగియనుండటంతో మరికొన్ని రోజులు పొడగించాలని కోరుతామన్నారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని. ..పార్టీ విధానం ప్రకారమే మాట్లాడినట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్థం చేసకోవచ్చు.  


ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్న మంత్రి పెద్దిరెడ్డి 


ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనంతపురంలో స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తే మంచిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీలో నిర్ణయాలు తీసుకునే అత్యంత ముఖ్యమైన నేతల్లో ఇద్దరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు ప్రస్తావన తీసుకు రావడం ఆసక్తికరంగా మారింది. 


పేరుకే ఉమ్మడి  రాజధాని - ఏపీ వ్యవహారాలు నిల్ !


నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలా మంది మర్చిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్ కు అప్పగించారు. దానికి ప్రతిఫలంగా ఎలాంటి భవనాలుతీసుకోలేదు.  లేక్ వ్యూ గెస్ట్ హౌస్  మాత్రమే ప్రస్తుతం ఏపీ అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు. చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కరోనా సమయంలో  పేషంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తూంటే..తెలంగాణ పోలీసులు ఆపారు. అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు.  వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 


ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త రాజకీయం ?


విభజన చట్టం ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని.. ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలి. అది సాధ్యం కాదు. ఇంకా విషయం ఏమిటంటే.. తెలంగాణ పార్టీలు.. పాలకులు అసలు అంగీకరించరు. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా  ప్రజల అవకాశాల్లో ఏ మాత్రం తేడా లేదని.. ఇప్పుడు మళ్లీ ఆ పేరుతో చిచ్చు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో వ్యతిరేక ప్రచారం చేసుకోవడం తప్ప ప్రయోజనం ఉండదన్న అంచనాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు తమకు ఏది మేలో అదే రాజకీయం చేస్తాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోందని అనుకోవచ్చు.