హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఇంటి నుంచే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే అవకావాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పించింది. భక్తులు మీ సేవ, పోస్టాఫీసు, టీయాప్ ఫోలియో (TAPP Folio) ద్వారా బుక్ చేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోవచ్చు.
భక్తులు వారి బరువు 1 కేజీకి రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నిలువెత్తు బంగారం సమర్పించేందుకు.. ఓ వ్యక్తి 50 కేజీలు ఉంటే.. బరువు ప్రకారం రూ.3000, మీ సేవా ఛార్జీలు రూ.35, పోస్టల్ ఛార్జీలు రూ.100 కలిసి మొత్తంగా రూ.3,135 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మేడారం జాతర ఆన్‌లైన్ సేవలు, ఇంటి నుంచే నిలువెత్తు బంగారం సమర్పణ సేవలను మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా మేడారం జాతర ప్రసాదం సైతం పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
రెండేళ్లకోసారి మాఘమాసంలో నిర్వహించే మేడారం జాతర.. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతరగా చెప్పవచ్చు. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదివరకే మంత్రులు మేడారం వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సైతం మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలి వస్తారు. కోటి మందికి పైగా సందర్శించుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.