RTC MD Sajjanar Tweet on Youth Crazy Antics: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేస్తుంటారు. వీటిలో కొన్ని సందేశాత్మకమైనవి అయితే, మరికొన్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా ఉంటాయి. యువత రీల్స్ మోజులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పలు సందర్భాల్లో కొన్ని వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. అలాగే, మరో యువకుడు ఆర్టీసీ బస్సుపై స్టంట్స్ చేస్తుండగా అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. తాజాగా, ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువకుడు దూరం నుంచి నిలిపి ఉన్న 3 బైక్స్ పై నుంచి దూకడంతో అతని తల రోడ్డును తగిలినట్లుగా ఆ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, లైక్స్, ఫాలోవర్స్ ఎక్కువ వచ్చేందుకు యువత ఇలాంటి విపరీత చేష్టలకు పాల్పడుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రాణం పోయినా, గాయాలైనా పర్వాలేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సామాజిక మాధ్యమాల మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం.' అంటూ ఎక్స్ (X) లో రాసుకొచ్చారు.
Also Read: Republic Day Celebrations Tragedy: గణతంత్ర వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి