TSRTC MD Sajjanar:
హైదరాబాద్: రాబోయే 5 నెలలు సంస్థకు ఎంతో కీలకమని TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు. 


పండుగ సీజన్ సన్నద్దత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉద్యోగులందరితో వర్చ్‌వల్‌ సమావేశాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు సెషన్లలో కొనసాగిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు.పలు అంశాలపై సిబ్బందికి ఆయన దిశానిర్ధేశం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను డ్రైవర్లు, కండక్టర్లను  అడిగి తెలుసుకున్నారు. 
ప్రభుత్వంలో విలీనం చేయడంతో బాధ్యత పెరిగింది..
సజ్జనర్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, ఇప్పుడు గతం కన్నా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. సంస్థపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. 
రెండేళ్లలో రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించాం..
గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని, వినూత్న కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువచేశామన్నారు. టీఎస్ ఆర్టీసీ మనుగడ కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు స్వాగతించారని చెప్పారు. వందరోజుల ఛాలెంజ్‌, శ్రావణ మాసం ఛాలెంజ్‌, రాఖీ పండుగ ఛాలెంజ్‌, దసరా ఛాలెంజ్‌, సంక్రాతి ఛాలెంజ్‌, ఏడీపీసీ ఛాలెంజ్‌.... ఇలా ఎన్నింటినో సిబ్బంది స‌వాలుగా స్వీక‌రించి లక్ష్యానికి మించి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేయడం వల్లే సంస్థకు సత్పలితాలు వచ్చాయని చెప్పారు. అందుకు రెండేళ్లలో రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించడమే నిదర్శమని గుర్తుచేశారు. సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకమనే పరిస్థితి నుంచి.. చూస్తుండగానే ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతూ.. స్వావలంబన దిశగా వెళ్తున్నందని అన్నారు. నేడు పబ్లిక్ లో ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ గ‌ణ‌నీయంగా పెరిగిందని చెప్పారు. 


ఒకవైపు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తూనే.. మరోకవైపు 45 వేల సిబ్బంది సంక్షేమంపై దృష్టి పెట్టామని వివరించారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ బాగుంటుందని భావించి.. మెరుగైన, నాణ్యమైన వైద్య సేవల కోసం టీఎస్ఆర్టీసీ తార్నాక ఆసుపత్రికి  కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించామన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ద్వారా ఎక్కడా లేని విధంగా సంస్థలోని పనిచేసే ఉద్యోగులందరికీ అతి తక్కువ సమయం 45 రోజుల వ్యవధిలోనే  వైద్య పరీక్షలు చేశామని, ఫలితంగా 500 మంది ప్రాణాలను కాపాడామని పేర్కొన్నారు.


టీఎస్ఆర్టీసీ అంటే భద్రతకు మారుపేరు అని, రోజు సగటున 40 లక్షల మందిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు మన బస్సులు చేరవేస్తున్నాయని చెప్పారు. కొందరు చేసే చిన్నపాటి తప్పుల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల విషయంలో తప్పు చేసిన వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దు. నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని  అధికారులను సజ్జనార్ ఆదేశించారు. 


ప్రయాణికులతో అమర్యాదగా, దురుసుగా ప్రవరించవద్దని సిబ్బందికి వీసీ సజ్జనర్ సూచించారు. కొందరు చేసే త‌ప్పిదాల‌ వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముందన్నారు. ఏ సంస్థ అయినా వృద్ది చెందాలంటే ప్రజల విశ్వాసం ముఖ్యమని, విశ్వాసం  కోల్పోతే ఆ సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని, బకాయిలను చెల్లించేందుకు ఒక ప్లాన్ ను సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వి.ర‌వీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటు హెచ్ఓడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.