TSRTC Ticket Fare: తెలంగాణ ఆర్టీసీ ప్రతీ పండగకు, పబ్బానికి ఆఫర్లు ప్రకటిస్తూ.. అనేత సదుపాయాలు కల్పిస్తోంది. కానీ ఈసారి మాత్రం గుడ్ న్యూస్ కు బదులుగా ఓ చేదు వార్త చెప్పింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. దీంతో ఆర్టీసీపై మరింత భారం పపడుతుండడంతో.. ఆర్టీసీ ఈ భారాన్ని ప్రయాణికులపై వేసింది. ఆర్టీసీ టికెట్ లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. ఈరోజు నుంచి దాన్ని అమల్లోకి తెస్తోంది. టీఎస్ఆర్టీసీ నిర్ణయంతో టికెట్ ధరలు పెరగనున్నాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు రూ.4 టోల్ ఛార్జీలను పెంచగా.. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేయనున్నారు. అలాగే టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. దీని వల్ల టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై భారం పడుతోంది. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలను 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అధిక టోల్ ఛార్జీలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా బస్సు టికెట్లలో టోల్ ఛార్జీలు పెంచడంతో సమాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. తెలంగాణలోని నేషనల్ హైవేలపై 20 టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 11, ఖమ్మం జిల్లాలో 5, నిర్మల్ జిల్లాలో 7, వరంగల్ లో 5 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఏప్రిల్ లో టోల్ ఛార్జీలను పెంచుతోంది. కానీ ఈసారి కాస్త ముందే పెంచింది.
ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
పండుగలు, జాతర లాంటి సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది. తాజాగా హైటెక్ బస్సులను కూడా రంగంలోకి దింపుతోంది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నాయి. ప్రైవేటు బస్సుల్లో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు ఈ బస్సుల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలో ఈ బస్సులు నడవనున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. లహరి పేరుతో తీసుకువచ్చిన ఈ ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతు పెద్ద పీట వేస్తూ.. ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.
మొత్తం 12 మీటర్ల పొడువు ఉండే ఏసీ స్లీపర్ బస్సుల్లో.. 15 లోయర్ బెర్త్ లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్ లు ఉంటాయి. బెర్త్ ల వద్ద మొబైల్ ఛార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యం ఉంటుంది. వీటితో పాటు బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాను కూడా అందించారు. వీటితో పాటు అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టంను ప్రత్యేకంగా అందించారు.