కేక్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం. కానీ బయట దొరికే కేకులు ఎక్కువగా మైదా పిండితోనే తయారు చేస్తారు. దీని వల్ల వారి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇంట్లోనే రాగి పిండి, చాక్లెట్ కలిపి చేసే కేకును తయారు చేస్తే వారికి ఆరోగ్యకరం కూడా. దీన్ని తయారు చేయడం చాలా సులువు. 


కావలసిన పదార్థాలు
రాగి పిండి - ఒకటిన్నర కప్పు 
నీళ్లు - ముప్పావు కప్పు 
పెరుగు - అరకప్పు 
బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్ 
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను 
కోకో పౌడర్ - ఒక స్పూన్ 
వెజిటబుల్ ఆయిల్ - మూడు స్పూన్లు
 బటర్ - ఒక స్పూను 
బేకింగ్ సోడా - ఒక స్పూను 
ఉప్పు - ఒక స్పూను 
పంచదార పొడి - మూడు స్పూన్లు


తయారు చేసే విధానం
1. ఈ కేక్ తయారు చేయడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి.  అందులో పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార పొడి, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. 
2. పది నిమిషాలు తర్వాత ఆ మిశ్రమంలో రాగి పిండి, కోకో పౌడర్, వెజిటబుల్ నూనె వేసి మందంగా వచ్చేలా కలపాలి. 3. మరీ మందంగా అనిపిస్తే కొద్దిగా నీరు వేసి పిండిని రెడీ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
4. కేకు మౌల్డ్ తీసుకొని దాని అడుగు భాగానికి బటర్ రాయాలి. తరువాత పార్చ్‌మెంట్ పేపర్ వేయాలి.  
5. ఇప్పుడు రెడీ చేసిన కేకు పిండిని ఆ మౌల్డ్‌లోకి వేసి గాలి బుడగలు లేకుండా నేలకి మెల్లగా కొట్టాలి. 
6. ముందుగానే ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్దకు ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసిన ఆ ఓవెన్లో అరగంట పాటు కేక్ మౌల్డ్‌ని ఉంచాలి. ః
7. ఆ తరువాత టూత్ పిక్‌తో గుచ్చి చూడాలి. టూత్ పిక్‌కు  ఏమీ అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే.


ఓవెన్ లేకపోతే...
ఓవెన్ లేకపోయినా కూడా కుక్కర్లో కేకును చేసుకోవచ్చు. 
1. కుక్కర్ అడుగు భాగంలో మెత్తటి ఇసుక లేదా రాళ్ల ఉప్పు వేయాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేసుకుంటే మంచిది. 
2. తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి. 
3. దాదాపు నలభై నిమిషాల పాటూ చిన్న మంట మీద ఉడికించాలి. 
4. ఒక సన్నని టూత్ పిక్ తో గుచ్చితే, దానికి ఏమీ అతుక్కోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే. 
5. ఇప్పుడు కేకు చల్లారాక తీసి ఒక ప్లేటులో వేయాలి. అంతే కేకు రెడీ అయినట్టే. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మీరే వండుతారు.   


Also read: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?




















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.