TSRTC Bus Pass Charges Hike : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. తాజాగా మరోసారి డీజిల్ సెస్ పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ.45, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి రూ.125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని ఆర్టీసీ పేర్కొంది. ఇధన ధరలు పెరగడంతో డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. అలాగే ​విద్యార్థులపై ఈ భారం పడింది. బస్ పాస్​ ఛార్జీలు భారీగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసకుంది. ఇప్పటి వరకు రూ.165తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు ఇకపై రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.  తాజాగా బస్‌పాస్‌ ఛార్జీలను పెంచడంతో పాటు ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీలను సవరించడంతో విద్యార్థులపై మరింత భారం పెరుగుతోంది. 


అదనపు ఆదాయం కోసమేనా?  


విద్యార్థుల బస్‌పాస్‌ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు ఆర్టీసీని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. తాజా ఛార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనపు ఆదాయం లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తు్న్నాయి.


విద్యార్థులపై మరింత భారం 


ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు బస్ పాస్ లు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని, 15వ తేదీ నుంచి పాస్ లు జారీ చేస్తామని ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త ఛార్జీల ప్రకారమే బస్ పాస్ లు అందజేయనున్నారు. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు బస్‌పాస్‌లు వినియోగిస్తున్నారు. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్‌ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు చేరనుంది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం దానిని రూ.600కు పెంచారు. టీఎస్ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ ఛార్జీలతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.