Tirumala Hundi Collection Today: టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో రికార్డు స్ధాయిలో హుండీ ఆదాయం ద్వారా భక్తులు స్వామి వారి కానుకలు సమర్పించారని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.. ఇవాళ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తుల సందేశాలకు ఫోన్ ద్వారా సమాధానం ఇచ్చి, భక్తుల సలహాలు, సూచనలు తీసుకున్నారు.. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మే నెలలో 22 లక్షల అరవై రెండు వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం కల్పించాంమని, హుండీ కానుకల ద్వారా 130 కోట్ల 29 లక్షల రూపాయలను భక్తులు కానుకగా స్వామి వారికి సమర్పించడం జరిగిందన్నారు.
టీటీడీ చరిత్రలో అత్యధికమైన హుండీ ఆదాయం మే నెలలో టీటీడీకి చేకూరిందని తెలిపారు.. కోటి 86 లక్షల స్వామి వారి లడ్డూ ప్రసాదం మే నెలలో విక్రయించామని, 47 లక్షల మూడు వేల మంది భక్తులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు.. 10 లక్షల డెభై రెండు వేల మంది భక్తులు కళ్యాణ కట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు వివరించారు.. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా భక్తులు స్వామి వారిని దర్శించుకోక పోవడం, వేసవి సెలవుల వల్ల మే నెలలో అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు విచ్చేసారని, అధిక భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో రెండు రోజులు పాటు భక్తులు వేచి ఉండే అవకాశం ఉందని, అనూహ్య రద్దీ కారణంగా భక్తులు ఒపికతో వేచి ఉండి స్వామి వారి దర్శనం చేసుకోవాలని టీటీడీ ఈవో కోరారు.. శ్రీవారి ఆలయంలో ఈ నెల 12వ తారీఖున జేష్ట్యాభిషేకంను నిర్వహిస్తున్నామని, తరతరాలుగా వస్తున్న స్వామి వారి ఉత్సవమూర్తులు అరిగి పోకుండా ఉండేందుకు ఈ క్రతువును ఏర్పాటు చేసారని వివరించారు..
ఈ క్రతువులో భాగంగా మొదటి రోజు మలయప్ప స్వామి వారికి ఉన్న బంగారు జవచంను తొలగించి, హోమాలు, అభిషేకాలు, స్నపన తిరుమంజనం నిర్వహించి, స్వామి వారికి వజ్ర కవచాని ఆలయ అర్చకులు అలంకరిస్తారని, రెండో రోజు ముత్యాల కవచం, మూడో రోజు తిరుమంజనం పూర్తి చేసి బంగారు కవచం అలంకరించడం జరుగుతుందన్నారు.. స్లాటెడ్ దర్శనానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు పూర్తి కాగానే తిరిగి స్లాటెడ్ దర్శనం ప్రారంభిస్తామని, స్లాటెడ్ దర్శనంలో రోజు జారీ చేసే సంఖ్యకు మించితే మరుసటి రోజుకు స్లాట్ మారుతుందని, దీంతో భక్తులు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
స్లాట్ దర్శనం పొందిన భక్తులందరికి తిరుమలలో వసతి కల్పించడం కష్టతరంగా మారుతుందని, టోకెన్లు కలిగిన భక్తులను సమయానికి దర్శనం కల్పించక పోతే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.. తిరుపతిలో టైం స్లాట్ వ్యవస్ధ జారీ చేసే సక్సెస్ కాదని, ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం ద్వారా సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తోందని, ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఆన్లైన్ లో టిక్కెట్టు పొందడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనం పొందగలుగుతున్నారని చెప్పారు.. ముందస్తు గానే టిక్కెట్ల పొందిన భక్తుడు ఎలాగైనా తిరుమలకు చేరుకోవచ్చని, ఎటువంటి ఆంక్షలు లేకుండా భక్తులకు అడిగిన లడ్డూలను భక్తులకు అందజేస్తున్నాంమని తెలియజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే గదులు కల్పించ గలుగుతున్నామని, ప్రస్తుతం తిరుమలలో 13 అతిథి గృహాలు పూర్తి స్ధాయిలో మరమ్మతు చేసి ఆగస్టు మొదటి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.