MP Raghu Rama : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అత్యధిక సీట్లు వస్తాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 120 మంది అసలు టికెట్లే అడగరని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని అంటున్నారని ఎంపీ రఘురామ అన్నారు. దిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఆక్షేపించారు. వైసీపీ చేయించిన ఓ సర్వేలో ప్రతిపక్ష పార్టీకి 115 సీట్లు, వైసీపీకి 60 సీట్లు వస్తాయనే నివేదిక వచ్చిందన్నారు. అయినా సీఎం జగన్ మాత్రం 175 సీట్లతో క్లీన్ స్వీప్ చేయాలని గంభీరంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. వాలంటీర్ అనే వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య సంబంధం లేకుండా పోయిందన్నారు. 


ప్రభుత్వం పాస్ అయితే ఎమ్మెల్యేలు ఎలా ఫెయిల్?


వైసీపీ ప్రభుత్వం పాస్ అయిందని సీఎం జగన్ అంటున్నారన్న ఎంపీ రఘురామ అయితే ఎమ్మెల్యేలు ఎలా ఫెయిల్ అయ్యారని ప్రశ్నించారు. పులివెందులలో బస్‌స్టాండ్‌ కట్టలేని ఎమ్మెల్యే ఎలా పాస్‌ అయ్యారని ప్రశ్నించారు. తన ఫొటో పెట్టుకుంటే చాలు గెలిచేస్తారన్న సీఎం జగన్, అలాంటప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగాల్సిన అవసరం ఏముందనన్నారు. చంద్రబాబు పాలనలో 93 శాతం మంది పదో తరగతితో ఉత్తీర్ణత సాధించారని ఎంపీ రఘురామ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతోనే విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని విమర్శించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో క్రమంగా సాక్షుల సంఖ్య తగ్గిపోతుందని ఆరోపించారు. తనకు ప్రాణభయం ఉందని వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి గతంలోనే ఎస్పీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సీబీఐ విచారణ ఆలస్యం అయ్యే కొద్ది పలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎంపీ రఘురామ అన్నారు.


రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు! 


ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి 60 సీట్లు మాత్రమే వస్తాయని ఎంపీ రఘురామరాజు అన్నారు. వైసీపీ అధికారికంగా చేయించుకున్న సర్వేలోనే ఈ విషయం వెల్లడైందన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. డిసెంబరులో శాసనసభను రద్దు చేస్తే వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌ లో ఎన్నికలు జరగొచ్చని ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మారుస్తానని సీఎం జగన్‌ అంటున్నారని కానీ దాదాపు 120 ఎమ్మెల్యేలు టికెట్‌ అడిగే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇస్తానంటే తప్ప అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని ఆరోపించారు.