Tsrtc Bumper Offer To Passengers: వేసవి సెలవుల దృష్ట్యా కుటుంబంతో కలిసి సరదాగా సుదూర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని అంతా అనుకుంటాం. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి రద్దీతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుండగా.. వారు అవసరాన్ని బట్టి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) కీలక ప్రకటన చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు 8 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tsrtconline.in వెబ్ సైట్ సదర్శించాలని అన్నారు. కాగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ కోసం ఇప్పటికే 10 శాతం రాయితీని సంస్థ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ముందుగా బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపు ఆఫర్ ఇచ్చారు.
మరోవైపు, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అలాగే, నగరంలోని ప్రధాన స్టేషన్లు, జేబీఎస్, ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.