ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. అశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నందున, గతంలో ఇచ్చిన హామీతో పాటు, సామాజిక, రాజకీయ సమీకరణలను కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కుస్తీ పడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో (నవంబరు 16) నామినేషన్లు ముగియనున్నాయి. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.


అయితే, అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు పూర్తి బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 స్థానాలను ఆ పార్టీకే దక్కనున్నాయి. సునాయాసంగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎమ్మెల్యే కోటా టికెట్ కోసం తాజా మాజీలతో పాటు.. చాలా మంది నేతలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మధుసూదనచారి, కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణ పేర్లు కూడా ఈ ప్రచారంలో ఉన్నాయి.


Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..


గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమే అయినప్పటికీ.. ఏ కోటాలో అవకాశం ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు. సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణకు గవర్నర్ కోటా లేదా స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. నేడు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఈరోజే కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. 


Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా.. 


మరోవైపు, స్థానిక సంస్థల కోటాలో నవంబరు 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులతో పాటు స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా లేక రెండు మూడు రోజులు ఆగి ప్రకటించాలా అనే తర్జనభర్జన కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, భానుప్రసాదరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు.


Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి