రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా మంగళవారం ప్రధాని మోదీ మాట్లాడారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడబోరని అన్నారు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదని అన్నారు. ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు దిల్లీలో బుధవారం మీడియా సమావేశం పెట్టారు. అంతకుముందు వారు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేశారు. మోదీ తన ప్రసంగంలో అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని.. రాష్ట్ర ప్రజలను మోదీ అవమానించారని కే కేశవరావు విమర్శించారు.
రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా పీఎం మోడీ మాట్లాడారు. పార్లమెంట్ లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏమీ ఉండదు. మెజారిటీ ఉందా లేదా అన్నది చూసి, బిల్ పాస్ చేస్తుంటారు. సభలో గలాటా జరిగితే, అప్పుడు ఏం చేయాలన్న విషయంపై కూడా రూల్ బుక్ ఉంది. తెలంగాణ బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్ధతు తెలిపింది. ఆ విషయం మర్చిపోవద్దు. బిల్లు సమయంలో ఆంధ్రా ఎంపీలు నిజంగానే బాగా గొడవ చేశారు. మా మిత్రుడు లగడపాటి రాజగోపాల్, మరికొందరు గలాటా చేశారు. కానీ రూల్ బుక్ నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆశాస్త్రీయం అంటే అర్థం ఏంటి? పెప్పర్ స్ప్రే వంటివి జరిగాయి. కాబట్టే సభాపతి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.’’
‘‘మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే, లాబీ క్లియర్ చేసి, వోటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్ బుక్ లో ఉంది. పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది. నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న తీరు ఆశాస్త్రీయం అనొచ్చు. ప్రస్తావన, నోటీస్, చర్చ ఏదీ లేకుండా బుల్ డోజ్ చేస్తూ బిల్లులు పాస్ చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు’’
‘‘ఝార్ఖండ్ బిల్ సమయంలో కూడా కొందరు వాజ్ పేయీ మీదకి దూసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నంలో ఆనంద్ మోహన్ అనే ఎంపీ చేయి విరిగింది. పెప్పర్ స్ప్రే ఘటన మినహా దాదాపు సాఫీగా తెలంగాణ బిల్లు ప్రక్రియ జరిగింది. పార్లమెంట్ పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదు. రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయా.. లేదా.. అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటాం.’’ అని కే. కేశవరావు మాట్లాడారు.