ప్రభుత్వ కార్యక్రమాల్లో, బహిరంగ సభల్లో నేతలు నోరు జారుతుండడం సహజమే. పక్కనే ఉన్నవారు నవ్వడమో లేక అప్రమత్తం చేయడమో చేస్తే వెంటనే తేరుకొని నాలుక కరుచుకుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో లెక్కనేనన్ని వెలుగు చూశాయి. రాజకీయ నాయకులు నోరు జారిన ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈయన ఇలా నోరు జారడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ ఆయన టీఆర్ఎస్‌కు బదులు కాంగ్రెస్ అని ఆయన మాట్లాడారు. కానీ, ఇప్పుడు ఏకంగా పార్టీకి వ్యతిరేకమైన వ్యాఖ్య చేసేశారు.


ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని బొక్కలతండా గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పాలంటూ ఆయన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోనియా గాంధీని పొగుడుతుండడంతో కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన కావాలనే అలా మాట్లాడారా లేక అనుకోకుండా మాట్లాడారా అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.


Also Read: Prakasam Accident: కాసేపట్లో పెళ్లి.. ఇంతలో నలుగురి మృతి, సూర్యాపేటలో మరో విషాదం.. ప్రైవేటు బస్సు బోల్తా


“2014లో మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అమ్మ సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమెకి కూడా తెలుసు. తెలంగాణ బిడ్డలు చాలా వివక్షకు గురవుతున్నారని.. ఎడారి ప్రాంతంలో ఉన్నారు. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగాల్లేవు. నిధులు లేవు, నియామకాలు లేవు. ఈ మూడింటిలో కూడా దగా పడుతున్నారని ఆమె కూడా గ్రహించి సంతకం పెట్టేసింది” అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యానించారు.


రాములు నాయక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఓ టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బులు కూడా ఇస్తామంటూ మాట్లాడారు. పక్కవాళ్లు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా ఈ వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ విషయం. సందర్భం ఏదైనా మాట్లాడే నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో క్షణాల వ్యవధిలో వీడియో మొత్తం వైరల్‌ అయిపోతోంది.


Also Read: Hyderabad Crime: మహిళ అత్యాశ! పోలీసులు మంచి చెప్పినా వినలేదు.. చివరికి లబోదిబో..