బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్లలాగా తెలంగాణపై దాడి చేస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఎంతో చేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు అనైతిక విమర్శలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలాడుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ప్రజల జేబుకు చిల్లు పెట్టింది బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఒక్కటైనా ఉందా బీజేపీ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. 
Also Read: TRS News: వాళ్లు చవటలు, దద్దమ్మలు.. సొల్లు పురాణం బంద్ చేయండి.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ నేతలు ఫైర్


అప్పుల కుప్పగా మార్చిన బీజేపీ..


కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని, దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చేసిందని ఆరోపించారు. పేదల కోసం బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు అన్ని అంశాల్లోనూ బీజేపీ పూర్తిగా విఫలమైందని.. అయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని భ్రమల్లో బీజేపీ నేతలున్నారని చెప్పారు. కరోనా కట్టడంలో బీజేపీ, ప్రధాని మోదీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అసైన్డ్ భూములు తీసుకున్న ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని బీజేపీ తమ పార్టీలో ఎందుకు చేర్చుకుందో సమాధానం చెప్పాలన్నారు.


మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే.. సీఎం కేసీఆర్
నేతల భాష హుందాగా ఉండాలని.. అయితే జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం నూటికి నూరు పాళ్లు అమలవుతున్నది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు  అధికారంపై ఆసక్తి తప్ప వేరే ఆలోచన లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పప్పులుడకవని.. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇదివరకే 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, త్వరలో మరో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 
Also Read: Eatala Rajender: దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నిక అలా నిర్వహించాలి.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్


త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండానే ఎగురుతుందని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని, వారి మాయమాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చందాలు అడుగుతున్నారని కాంట్రాక్టర్ల ద్వారా తెలిసిందంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.