హుజారాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతుంది. అధికార టీఆర్ఎస్‌పై. కాంగ్రెస్, బీజేపీ తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ కుడిభుజంలా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో భాగంగా కమలాపూర్‌లో పర్యటించారు. నేతలు, ఓటర్లను ఎలా కొనుగోలు చేయాలి, ప్రలోభపెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.


కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి వాతలు పెట్టడం ఖాయమన్నారు. ఈటల అనే కేవలం ఒకే ఒక్క వ్యక్తిని ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఓవైపు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, మరోవైపు ఎన్నికలు అనగానే దళిత బంధు లాంటి పథకాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నికల రిహార్సల్ లాంటిదని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారు.


ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన, పోలీసుల రాజ్యం, అధికారుల రాజ్యం నడుస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని, అందుకు తెలంగాణ ప్రజలు నడుం బిగించాలని ఈటల పిలుపునిచ్చారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కేవలం ఒక్క వ్యక్తిని ఓడించేందుకు అధికార పార్టీ, మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే తమదే విజయమని.. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. 


Also Read: Jagga Reddy: పీర్ల పండగలో చిందేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో


మరోవైపు తన నియోజకవర్గంలో ప్రజా దీవెన పాదయాత్రతో ప్రజల నమ్మకం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో అస్వస్థతకు గురికావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా.. మళ్లీ పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తనపై ప్రజలకు విశ్వాసం ఉంది కనుకనే పలుమార్లు వరుస ఎన్నికల్లో తనను గెలిపించుకున్నారని, తనకు ప్రజా బలం ఉందని ఈటల వ్యాఖ్యానించారు. ఈటల ఒంటరి కాదని, ఆయన వెంట బీజేపీ నేతలం ఉన్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క నేత ఈటల రాజీనామాతో రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు వచ్చాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 
Also Read: Weather Updates: రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు... ఏపీ, తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం