Revanth Reddy: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. దానికి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన దగాకోరును రాబోయే 100 రోజుల్లో గద్దె దించడం గ్యారంటీ అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి తన ట్విటర్ ఖాతాలో ఏమని రాసుకొచ్చారంటే.. మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ అన్నారు. కాపలా కుక్కలాగా ఉంటానని ప్రజలను మోసం చేస్తూ, ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ అన్నారు. కమీషన్లను దండుకోవడమే 'మిషన్' లాగా పెట్టుకున్న వసూల్ రాజాల భరతం పడతామని, పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన వినాశకారులను పాతరేస్తామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన 'గులామీ' గ్యాంగును పాతాళానికి తొక్కుతామన్నారు.
నాలుగు కోట్ల ప్రజల కళ్లుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికిస్తామని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచరికాన్నే పీచమణిచిన గడ్డ తెలంగాణ అని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఓ లెక్కా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.
మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని ఎక్స్ (ట్విట్టర్)లో ఫైరయ్యారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని చెప్పారు.
దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం తధ్యమని, బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా, ధీమా గల్లంతవుతాయన్నారు. సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం తప్పదని వెల్లడించారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీనెక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేస్తారని తెలిపారు. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ అని, స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.