Revanth Reddy: తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రత మాత్రం కల్పించడం లేదన్నారు. దీనికి తోడుగా గత జులైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు.
తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. తక్షణం తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. లేదంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా, గతంలో రేవంత్ రెడ్డి యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ రేవంత్‌కు సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
పాదయాత్ర సమయంలో భద్రత కోరిన రేవంత్ రెడ్డి
భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్ కట్టకుండా అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తనకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపింది. పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) తెలిపారు. భద్రత కల్పించాలని ఆదేశించిన ఫ్యాక్స్ కాపీని కోర్టుకు సమర్పించారు. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? కోర్టుకు తెలపాలని రేవంత్ తరఫు న్యాయవాదికి సూచించింది. దీనిపై రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆ భద్రత కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని వివరించారు. దీంతో నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు పూర్తి భద్రక కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.