Sajjala On Sharmila  :  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వైఎస్ షర్మిల మద్దతివ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆమె నిర్ణయం ఆమె ఇష్టమేనని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై ఏ పార్టీ వేధించి కేసులు పెట్టిందో ఆ పార్టీతో చేతులు కలపడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. నాడు సోనియా గాంధీని కలిసిన వారిలో షర్మిల కూడా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలని,    ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందన్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర విషయాలను పట్టించుకోరన్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని  షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కాంగ్రెస్ అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధమని షర్మిల అన్నారు. ఆయన బతికుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికే ప్రధాని అయ్యేవారని అభిప్రాయపడ్డారు. 'వైఎస్ 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ కుటుంబమంటే చాలా అభిమానం. రాహుల్ ను ప్రధానిని చెయ్యాలని మొట్ట మొదట వైఎస్సారే అన్నారు. సోనియా, రాహుల్ లు వైఎస్ పై వారికున్న అభిమానాన్ని నాపై చూపుతున్నారు.' అంటూ షర్మిల పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల తెలిపారు. ఇటీవల రాహుల్, సోనియాలు తనను ఢిల్లీకి ఆహ్వానించారని వారితో రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చాయని, ఇటు తెలంగాణలోనూ విజయం సాధించే అవకాశం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం భిన్నంగా స్పందించారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా వేధించారని చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం భిన్నంగా స్పందించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, కుమారుడు కాంగ్రెస్ విషయంలో రెండు రకాలుగా మారడం ఆసక్తికరంగా మారింది. 


వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారని.. వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ రెడ్డి కోరారు. పార్టీ అనుమతి ఇవ్వకపోయినా మందీ మార్బలంతో  ఓదార్పు యాత్ర చేశారు.  చివరికి కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ..  సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.