Thangalaan: రీసెంట్ గా 'పొన్ని యన్ సెల్వన్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ త్వరలోనే 'తంగలాన్'(Thangalaan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం ప్రయోగం చేశాడు విక్రమ్. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో విక్రమ్ గెటప్ చూసి అందరూ షాక్ అయిపోయారు. మంచి ఫిజిక్ తో ఉండే విక్రమ్ తంగలాన్ కోసం పూర్తిగా బరువు తగ్గిపోయి బక్క చిక్కిపోయి కనిపించాడు. సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ప్రయోగాలు విక్రమ్ కి కొత్తమీ కాదు. గతంలో 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' సినిమాల్లో చేసి ప్రేక్షకుల్ని అలరించాడు.


మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎవరో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తంగలాన్ టీజర్ విడుదలైందో అప్పటినుంచి సౌత్లో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది. నార్త్ లో కూడా 'తంగలాన్' మూవీ పై బజ్ పెరుగుతోంది. ఇక రీసెంట్ గా హైదరాబాదులో మూవీ టీం టీజర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించగా, ఆ ప్రెస్ మీట్ లో విక్రమ్ సినిమా గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. అందులో ప్రధానంగా 'తంగలాన్' సినిమాలో తనకు ఎటువంటి డైలాగ్స్ లేవని విక్రమ్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 'తంగలాన్' మూవీ విక్రమ్ నటించిన 'శివపుత్రుడు' తరహాలోనే ఉండబోతుందని వార్తలు సైతం వైరల్ అయ్యాయి.






ఇదే సమయంలో ఒక హీరో పాత్రకు డైలాగ్స్ లేకుంటే అది సినిమాకే నష్టం అనే వాదన కూడా వచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో చియాన్ విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమా టీజర్ లో మాత్రమే విక్రమ్ కి డైలాగ్స్ లేవని, కానీ సినిమాలో ఆయన డైలాగ్స్ ఉన్నాయని వివరించారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని సినిమా మొత్తంలో డైలాగ్స్ ఉండవని అందరూ అనుకుంటున్నారని, అలాంటిదేమీ లేదంటూ చెప్పారు. అంతేకాకుండా తంగలాన్ సినిమాలో విక్రమ్ మేకోవర్ మాత్రమే కాదు డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొద్దిరోజుల నుంచి తంగలాన్ మూవీలో విక్రమ్ డైలాగ్స్ పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కు చెక్ పడినట్లు అయింది.


కాగా కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 'కబాలి', 'కాలా' 'సార్పట్టా' వంటి సినిమాలను తెరకెక్కించిన పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పార్వతి తిరువోతూ, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పశుపతి, డానియల్, హరికృష్ణన్, అన్బుదురై ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ. కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, సెల్వ ఆర్కే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే.ఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


Also Read : మొన్న 'బ్రో' నేడు 'వాల్తేరు వీరయ్య' - టీవీల్లో మెగాస్టార్ మూవీకి డిజాస్టర్ రేటింగ్స్!