తెలంగాణా ఎలక్షన్ నగారా మొగిన వేళ అధికార పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో తెలంగాణ   ప్రజలకు కేసీఆర్ పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు.  ప్రజలంతా దసరా రోజు ఆయుధాలకు పూజలు చేసి తెలంగాణను పట్టిపీడిస్తున్న రావణాసురుడి నుంచి విముక్తి పొందబోతున్నారని జోస్యం చెప్పారు.  సచివాలయ నిర్మాణంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి  పాల్పడింది అని చెప్పిన ఆయన కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు (6 Guarantees) ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. కాంగ్రెస్  మానిఫెస్టో ప్రకటన తరువాత కేసీఆర్‌  అసలు ప్రజాక్షేత్రంలో లేరని, అయినా ఇకపై కేసీఆర్‌ ఎక్కడ ఉన్నారని వెతకావాల్సిన పని ప్రజలకి, ఫాం హౌస్  నుంచి బయటకు రావాల్సిన పని కేసీఆర్‌ కి కూడా లేదన్నారు. తెలంగాణలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిన  కేసీఆర్‌ కుటుంబం ఇక  విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 


తాము చెప్పిన 6 గ్యారంటీలను ఎన్ని అవాంతరాలు వచ్చినా అమలు చేసి తీరుతాం అన్నారు. డిసెంబర్ 9న వీటిని అమలు చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తాం అన్నారు.  రాష్ట్రంలో సంపద పెంచాలి, దానిని సరైన పద్ధతిలో పేదలకు పంచాలి అన్నదే  కాంగ్రెస్‌ విధానమన్న రేవంత్ రెడ్డి , రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే పేద ఆడబిడ్డలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని,  పట్టణ, గ్రామీణ పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఉద్యమ కారులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. 


కేసీఆర్ వచ్చిన తర్వాత 3 వేల వైన్ షాపులు, 1800 బార్లతో పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారని.. తాము మాత్రం పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రూ. 10 లక్షల విలువైన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తామనీ,  తెలంగాణ రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీతో పాటు ఇందిరా భరోసా కింద ప్రతి ఎకరాకు రూ. 15 వేల పెట్టుబడి సహాయం అందిద్దామని, ఇది కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, అవినీతిని నిర్మూలించి, కుటుంబ దోపిడీని అరికట్టి ఈ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. 


బావ-బావమర్దులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారనీ , వారికి  స్థాయి లేకపోయినా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, రుణమాఫీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్.. ఇలా  దేనిమీద చర్చకు సిద్ధమో చెబితే తమ  ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వస్తామన్నారు.  ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో, ఎవరు దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందే  తేల్చుకుందాం అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్న మహానుభావురాలు సోనియా అన్న రేవంత్ రెడ్డి ఆమే బిడ్డలుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక  ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.