వరంగల్ జిల్లాలో 44 కంటి వెలుగు శిబిరాలను నేడు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. రెండో విడుత కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో ప్రభుత్వం 44 బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వంద రోజులపాటు జిల్లాలో 408 శిబిరాల నిర్వహణతో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు జరిపి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. నిత్యం 44 శిబిరాల్లో 44 బృందాల ద్వారా జిల్లాలో 700 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిబిరాల వద్ద బృందాలకు భోజనం, టెంటు, కుర్చీల ఏర్పాటు ఖర్చు కోసం నిధులు కేటాయించింది. కంటి పరీక్షల నిర్వహణకు ఏఆర్‌ మిషన్లు, మందులు, టార్చ్‌లు, కళ్లద్దాలు, ట్యాబ్‌లను పీహెచ్‌సీలకు సరఫరా చేసింది. దీంతో నేటినుంచి పని దినాల్లో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేత్ర పరీక్షలు చేయనున్నారు.


రెండ్రోజుల్లో టీచర్ల బదిలీల షెడ్యూల్‌.. వారం తర్వాత దరఖాస్తుల ప్రక్రియ


ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ రెండ్రోజుల్లోగా విడుదల కానుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం వారం తర్వాత షురూ కానుందని సమాచారం. మొదట షెడ్యూల్‌ను విడుదల చేసి ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బదిలీలు, పదోన్నతుల అంశంపై సమావేశమైన మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు రెండు రోజులు వరుసగా భేటీ అయ్యారు.


బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు . బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను 32 నుంచి 35రోజుల వరకు పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యింది. అయితే కలెక్టర్లు కంటి వెలుగు కార్యక్రమంలో బిజీగా ఉండటంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది.


గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఖరారు
తెలంగాణలో తొలి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్‌ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్‌ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్‌ తదితర వివరాలకోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఉద్యోగార్థులకు సూచించింది.