నోటిదూల నేతల్ని జగన్ అదుపులో పెట్టుకోవాలి, ఆ మాటలు ఆకాశంపై ఉమ్మివేయడమే - చంద్రబాబు
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్ సీపీ నేతల స్పందనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. అహంకారంతో వైఎస్ఆర్ సీపీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలు తెలుగు ప్రజలు ఎవరూ సహించలేరని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ నేతలు చేసిన విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అని తీవ్రంగా ఖండించారు.
‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇంకా చదవండి
విశాఖ సీతకొండకు వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఉద్యమం
ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న విశాఖ సీత కొండ కు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఉద్యమం చేయడానికి పిలుపునిచ్చారు. సోేమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఉదయం నుంచి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖ లో సీత కొండ పేరు మార్చడం అన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి పిలుపు నివ్వడం తో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తో సహా బిజెపి నేతలను విశాఖ పోలీసులు లఅదుపులోకి తీసుకున్నారు.
స్టిక్కర్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు : మాధవ్
స్టిక్కర్లు ప్రభుత్వంగా పేరు గాంచిన వైసీపి ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు పేర్లు మార్చే పనిలో పడింది ఇదేమిటని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులకు దిగుతోందని పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. పాలక పార్టీకి అధికారులు తందానా తానా అనడంతో ప్రభుత్వానికి పైత్యం ప్రకోపించి పిచ్చి పదిరకాలు అన్నచందంగా వ్యవహరిస్తోందని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభత్వం సంక్షేమ, అభివృద్ది పధకాలకు స్టిక్కర్లు వేసుకోవడానికి అలవాటు పడి సీత కొండ కు పేరు మార్చేసింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత సిఎం అనుకుంటున్నారా అని మాధవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ ఆర్ వ్యూ గా పేరు మార్చడంతో స్ధానికులు ప్రభుత్వాన్ని అసహ్యంచుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం అధికారులు నిభంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్య మంత్రి కి పిచ్చి పరాకాష్టకు చేరి రాష్ట్రంలో ని అన్ని జిల్లాలకు వైఎస్ ఆర్ పేరుగా మార్చి రాష్ట్రానికి కూడా మార్చుకుంటారా అని ప్రశ్నించారు. ఇంకా చదవండి
మంత్రి కేటీఆర్ వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీ: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత పరిస్థితీ చాలా అధ్వాన్నంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు వాట్సాప్ లో, టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో చెప్పారు. అలాగే భూములు, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు కొల్లగొట్టి.. ఇప్పుడు నిరుద్యోగులు, యువత జీవితాలను నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈ ప్రశ్నా పత్రాల లీకేజీకి సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ యే కారణం అని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతీ ఇవ్వలేదని అన్నారు. ఇంకా చదవండి
సమస్యల పరిష్కారం కోసం చుట్టుముట్టిన జనం - అసహనంతో చేయి చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !
ఎలమంచిలి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు సహనం కోల్పోయారు. తన పీఏపైనే దాడి చేశారు. చెంప చెళ్లుమనిపించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. అయితే సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్‌నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్ నినాదాలు చేశారు.
వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పీఏ నవీన్‌వర్మ ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఎమ్మెల్యే ఇలా దురుసుగా వ్యవహరించడం ఇదే మొదటి సారి కాదన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట తనకు విద్యా దీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. చివరికి ఆ విద్యార్థికి క్షమాపణ చెప్పి నిధులు ఇచ్చారు. ఇంకా చదవండి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత! ఎయిమ్స్‌కి తరలింపు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండగా, కుటుంబ సభ్యులు వెంటనే కిషన్ రెడ్డిని ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. అయితే, ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్ కేర్ యూనిట్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. చికిత్స తర్వాత సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేస్తారని తెలుస్తోంది.