ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్ సీపీ నేతల స్పందనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. అహంకారంతో వైఎస్ఆర్ సీపీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలు తెలుగు ప్రజలు ఎవరూ సహించలేరని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ నేతలు చేసిన విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అని తీవ్రంగా ఖండించారు.
‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాజమండ్రి టీడీపీ నేతల అరెస్టు అక్రమం - చంద్రబాబు
టీడీపీ నేతలు ఆదిరెడ్డి ఆప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్టు ను ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప...వారిలో మార్పు రావడం లేదు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం....అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుంది. సిఐడి అనేది దర్యాప్తు ఏజెన్సీనా...లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారకపోవడం...సిఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శన. దుర్మార్గపు ప్రభుత్వం అన్నింటికీ మూల్యం చెల్లిస్తుంది.
చంద్రబాబు మేడే శుభాకాంక్షలు
నేడు (మే 1) మేడే సందర్భంగా చంద్రబాబు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రామిక, కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. మీ కష్ట ఫలితమే సమాజ ప్రగతి. అందుకే శ్రమజీవుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ది తో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. మీ కష్టానికి విలువ పెరిగే మంచి రోజులు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.