Actor Sai Dharam Tej Tweet On Social Media Usage: మెగా మేనల్లుడు, ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్‌కు (Sai Dharam Tej) ఉన్న క్రేజే వేరు. ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం తన మామయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవడంతో సాయితేజ్ సందడి అంతా ఇంతా కాదు. సెలబ్రేషన్స్‌లో భాగంగా పవన్‌ను హగ్ చేసుకుని ఎత్తుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సాయిధరమ్ తేజ్.. పలు అంశాలపై స్పందిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా, ఆయన తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'సామాజిక మాధ్యమాలు నియంత్రించలేనంతగా క్రూరంగా, భయానకంగా మారిపోయాయి. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలి. పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల పోటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే.. సోషల్ మీడియా మృగాలకు పేరెంట్స్ బాధ అర్థం కాదు.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అదే కారణమా..?
ఇటీవల కొంతమంది యూట్యూబర్లు పిల్లల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూనో.. పిల్లలతో కలిసి పేరెంట్స్ చేసిన వీడియోలపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారనే దానిపై సాయితేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తండ్రి తన కూతురితో సరదాగా వీడియో చేయగా.. కొంతమంది యూట్యూబర్స్ 'డార్క్ కామెడీ' పేరుతో ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఆ కామెంట్స్‌ను సాయితేజ్ ప్రస్తావిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్‌ను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కోరారు.
ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలకు, సంబంధిత కార్యాలయాలకు.. ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం తన పేరును 'సాయి దుర్గా తేజ్'గా పేరు మార్చుకున్నారు.
స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం
అటు, సాయిధరమ్ తేజ్ ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. ఈ ఘటనను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'ఎంతో కీలక సమస్యను ఎత్తిచూపినందుకు సాయితేజ్‌కు కృతజ్ఞతలు. సోషల్ మీడియాలో చిన్నారులపై వికృత ధోరణులు, వేధింపులను అరికట్టేందుకు మా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. పిల్లలకు మెరుగైన, సురక్షితమైన ఆన్ లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి మనం కలిసి పనిచేద్దాం.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.