Chief Secretary Position TS: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ కొనసాగింపు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నెల 12వ తేదీలోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ కుమార్‌ ను డీవోపీటీ ఆదేశించింది. దీంతో తక్షణమే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేక్ కుమార్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. మరోవైపు కొత్త సీఎస్ రేసులో ముగ్గురు అధికారులు ఉన్నారు. వారిలో ఎవరు నియామకం అవుతారనే అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే.. రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే డెప్యూటేషన్ పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండడం.. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని(1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (డెప్యూటేషన్ పై ప్రస్తుతం కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. 


సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్ గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన శాంతి కుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లలో ఒకరిని సీఎస్ గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. అయితే ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరు ఉన్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్పెషల్ సీఎస్ లుగా ఉన్న శాంతి కుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. 


కొత్త సిఎస్ పై నేడు ఉత్తర్వులు...


తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ కావాంటూ డీవోపీటి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రానికి కొత్త సిఎస్ ను నియమించే పనిలో ప్రభుత్వం పడింది. కొత్త సిఎం పై ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎవరు కొత్త ప్రధాన కార్యదర్శిగా నియామకం అవుతారో చూడాలి.