Tomato Price News: ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. ఏది కొందామన్నా ధర రూ. 80 పైనే ఉన్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.  కూరల్లో ఎక్కువగా వాడే టమాటా ధర ఏకంగా రూ. 100 నుంచి రూ.120వరకు పలుకుతుంది. తీవ్రమైన ఎండలకు రాష్ట్రంలో టమాటా సాగు తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సరుకు తక్కువ రావడంతో ధరలు రోజురోజుకు  పెరుగుతోన్నాయి. మూడు రోజుల క్రితం కిలో టమాటా రూ.60 నుంచి రూ.70వరకు పలికేది. తాజాగా దాని ధర డబుల్ అయింది. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టమాటాతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 


కొండెక్కిన టమాట 
మార్కెట్లో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. టమాట  సాగు తెలంగాణలో భారీగా పడిపోయింది.  డిమాండ్​కు తగ్గ సరఫరా లేకపోవడంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి.  మూడు రోజుల కింద రూ.70 పలికిన కిలో టమాటా.. ఇప్పుడు సెంచరీ కొట్టింది. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.  సాధారణంగా నగరంలోని బోయిన్​పల్లి మార్కెట్​కు ఐదు వేల క్వింటాళ్ల టమాట మార్కెట్​కు వస్తే కానీ  హైదరాబాద్ జనం అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటలోనూ 96 శాతం బయట నుంచే వస్తుండగా.. 3.34 శాతం మాత్రమే రాష్ట్రం నుంచి వస్తుంది.  ప్రస్తుతం ఇది ఏ మాత్రం సరిపోవట్లేదు. జూన్ 19వ తేదీ బోయిన్​పల్లి హోల్​సేల్​ మార్కెట్​కు  2,125 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది.  


ఎండల ప్రభావంతో తగ్గిన సాగు
తెలంగాణలో పండిన పంట కేవలం 71క్వింటాళ్లు మాత్రమే.  మిగిలిన పంట ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అవుతుంది. ఇందులో 1000క్వింటాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి నుంచి వచ్చింది. తెలంగాణలోని వికారాబాద్, శామీర్​పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల,  గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాట పంట రావడం లేదు. తీవ్రమైన ఎండల వేడికి టమాట పంట తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.


మండిపోతున్న కూరగాయల ధరలు
టమాట ధరల పెరుగుదల మిగతా కూరగాయలపై పడింది.  దీంతో మార్కెట్​లో కూరగాయ ధరలు మండిపోతున్నాయి.  పచ్చిమిర్చి కిలో రూ.120 నుంచి రూ.140వరకు పలుకుతోంది. మొన్నటి వరకు రూ.100 లకు నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డలు ప్రస్తుతం వందకు రెండి కిలోలే వస్తున్నాయి. అంటే కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతోంది. కొత్తి మీర ధర కూడా భారీగానే పెరిగింది. కిలో కొత్తి మీర రూ.200 పైనే పలుకుతోంది. ఫ్రెంచ్​బీన్స్ రూ. 175  నుంచి 210, టమాటా రూ. 100నుంచి 120,  దొండకాయ రూ. 70నుంచి 80, బీరకాయ రూ.80నుంచి 100, బెండకాయ రూ.80నుంచి 100, కాకరకాయ రూ.80, క్యారెట్‌ రూ.80గా ఉన్నాయి. 


పడిపోయిన పంట ఉత్పత్తి
పంట ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అన్నిరకాల కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్ కు రూ.500 పట్టుకు వెళితే కనీసం సంచి అడుగుకు కూడా నిండడం లేదని సామాన్యులు వాపోతున్నారు.  నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌‌‌‌సేల్‌‌‌‌లోనే కిలో రూ.100 దాటింది. కాగా రిటైల్ మార్కెట్లోత కిలో రూ.120 వరకు అమ్ముతున్నారు. ఆలుగడ్డ, చామగడ్డ లాంటివి కూడా కిలో రూ.60కి తగ్గడం లేదు.  అన్నిరకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్‌ కు వెళ్లాలంటే జంకుతున్నారు.