AP Latest News: విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక ప్రాంతంలో కట్టిన భవనాల గురించి టీడీపీ, వారి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిగ్గు ఎగ్గూ లేని టీడీపీ, సిగ్గూ ఎగ్గూ అనుకూల మీడియా అంటూ పరుషపదజాలం వాడారు. ‘‘జగన్ రెడ్డి అక్కడ నివాసం ఉన్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం జగన్ రెడ్డి ఇల్లు, కార్యాలయం లోటస్ పాండ్. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచే పరిపాలన చేశారు. ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఉండడం కానీ, గెస్ట్ హౌస్‌ల్లో ఉండడం అనేది జగన్ మోహన్ రెడ్డి రక్తంలోనే లేదు. ఆ ఖర్మ జగన్‌కు పట్టలేదు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాతే ఆయన విశాఖకు వెళ్తారు. అలాంటిది రుషికొండ భవనాలు జగన్ తన కోసం కట్టుకున్నారని ఎవరు చెప్పారు?’’ అంటూ మాట్లాడారు.


తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని ఫస్ట్ టార్గెట్ అని హోంమంత్రి వ్యాఖ్యానించారని విలేకరులు ప్రశ్నించగా.. కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. తనను టార్గెట్ చేసినంత మాత్రాన మిగతా పనులు ఆగవని, జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని అన్నారు. ‘‘నన్నే కాదు, జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తారు. ఎన్నికలు ముగియగానే జగన్ ఇంటివద్ద మొత్తం సెక్యూరిటీని తీసేశారు. అనుకూల మీడియా కెమెరాలతో మొత్తం చూపించారు. ఇలాంటి వాటికి ఎవరూ భయపడే ప్రసక్తి లేదు. ఎవరికి ఎవరు టార్గెట్టో రాబోయేరోజుల్లో చూద్దాం’’ అని కొడాలి నాని అన్నారు. 


సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌పై కూడా టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వారు హామీ ఇచ్చిన మేరకు సూపర్‌ - 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేల భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.