Andhra Pradesh News: విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతోన్న తెలుగు విద్యార్థినులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల్లో రెండోసారి ఇలాంటి ఉదంతం బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. 


అమెరికాలో మరో ఇద్దరు తెలుగమ్మాయిలు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం డల్లాస్ లోని మాసీ మాల్ లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు కారం మానసరెడ్డి, పులియాల సింధూజా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కారం మానసరెడ్డి గతంలో సైతం పలు దొంగతనం కేసుల్లో అరెస్ట్ అయ్యి బెయిలు పొందినట్లు చెబుతున్నారు. అయినా దొంగతనాలు వీడకుండా ప్రస్తుతం మరో అమ్మాయితో కలిసి షాపింగ్ మాల్ లో దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయింది. 


వీరిద్దరూ చదువుకునేందుకు అంటే స్టడీ వీసా మీద యూఎస్ వచ్చారు. గత నాలుగు నెలల్లో రెండోసారి  తెలుగు విద్యార్థినుల ప్రమేయం ఉన్న ఘటన బయటపడటంతో  విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల ప్రవర్తనపై సందేహాలు కలిగేలా చేస్తోంది. విలాసాలకు అలవాటు పడి వారు ఇలాంటి వాటికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.  


మార్చి 19న వీళ్లలాగే అమెరికాలోని ఓ షాపింగ్ మాల్ లో వస్తువులు తీసుకొని బ్యాగుల్లో సర్దేసి కొన్ని వస్తువులకే బిల్లు కట్టి వెళ్లిపోదామని ప్రయత్నించిన భవ్య లింగనగుంట, యామిని వల్కలపూడి అనే  ఇద్దరు తెలుగమ్మాయిలు పట్టుబడ్డారు. పోలీసులు వీరి చేతికి బేడీలు వేసి తీసుకెళ్తున్న క్రమంలో  వీరిద్దరూ తమను విడిచి పెడితే తాము దొంగతనం చేసిన  వస్తువులకు డబుల్ రేటు ఇస్తామని, మరోసారి తప్పు జరగదని పోలీసులతో మాట్లాడుతోన్న వీడియో ఓకటి అప్పట్లో వైరలైంది. 


ఇలా వరుస ఘటనలు బయటపడటంతో  ఇండియాకు తిరిగి వెళ్లేటప్పుడు విలువైన, ఖరీదైన వస్తువులు తెచ్చి చూపించే అమెరికాలోని తెలుగు విద్యార్థులు అక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడి వాటిని సంపాదిస్తున్నారో  అనే సందేహాలు తలెత్తుతున్నాయి.