Bandi Sanjay :   పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంజూరైన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. అందుకే ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి బెయిల్ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్ల పన కూడా వాదనలు ముగిశాయి.   తీర్పును మంగళవారానికి వేశారు.


సంచలనం రేపిన పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపి బండి సంజరును పోలీసులు కుట్ర దారునిగా గుర్తించి ఏ -  1 పెట్టి కేసులు నమోదు చేశారు.     120 బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   వాట్సాప్ ద్వారా మీడియాకు రావడం... అక్కడి నుండి ఓ మాజీ మీడియా ప్రతినిధి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించడం జరిగింది. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్ వాట్సాప్ కు అది వచ్చింది. దీంతో పోలీసులు బండి సంజయ్ సహా పలువురిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.  


ఈ కేసులో బండి సంజయ్‌కు హనుమకొండ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణకు సహకరించాలని ఆదే్శించింది. తర్వాత బండి సంజయ్‌ను ఫోన్ అప్పగించాలని విచారణకు రావాలని హన్మకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు.  ఫోన్‌తో విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే తన  ఫోన్ పోయిందని అందుకే విచారణకు రాలేనని చెప్పారు బండి సంజయ్‌. తన ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవద్దని చెప్పారు. ఎంపిగా ఉన్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులకు చెప్పారు. 


మరోవైపు ఈ కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని వరంగల్‌ సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలుచేశారు.  ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేస్తానన్నారు.  రంగనాథ్‌ ఇష్యూను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమని ప్రకటించారు. ఆయన తీరుపై రంగనాథ్ కూడా స్పందించారు. నిందితులు ... పోలీసులపై అసహనం వ్యక్తం చేయడం.. ఆరోపణలు చేయడం సహజమేనన్నారు. సాక్ష్యాల ప్రకారమే కేసులు పెట్టామన్నరు.