Sharmila :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల .. కాంగ్రెస్‌లో విలీనంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని హామీల విషయంలో స్పష్టత రావాల్సి ఉండటంతో ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో ఖర్గేతో సమావేశం అయిన షర్మిల.. పలు అంశాలపై చర్చలు జరిపి హైదరాబాద్  తిరిగి వచ్చారు. వచ్చే వారం రోజుల్లో మొత్తం చర్చలు పూర్తవుతాయని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నారు. షర్మిల పార్టీ విలీనం తర్వాత తనకు లభించే ప్రాధాన్యతపై స్పష్టత కోరుతున్నారు. తనకు పాలేరు టిక్కెట్ ఇవ్వాలని అంటున్నారు. అయితే పాలేరు నుంచి పోటీ చేసేందుకు  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీ అయ్యారు. దీంతో షర్మిలను  సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని హైకమాండ్ ఆఫర్ ఇచ్చినట్లగా చెబుతున్నారు. 


గ్రేటర్ లో ఏదో ఓ సీటు నుంచి పోటీ చేయమని ఆఫర్    


సికింద్రాబాద్ కాకపోయినా జంట నగరాల్లో ఏదో ఓ నియోజకవర్గం ఎంపిక చేసుకోవచ్చని సూచించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆమె  సేవలు.. ఏపీకి కూడా అవసరం అని అక్కడ కూడా పని చేయాల్సి ఉంటుందని హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆసక్తిగా లేరని చెబుతున్నారు. తన ఇద్దరు బిడ్డలు వేర్వేరు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని ఒకరికొకరికి పోటీ ఉండదని విజయలక్ష్మి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏపీలో ప్రచారం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అవుతుంది. అందుకే షర్మిల తటపటాయిస్తున్నారని అంటున్నారు. 


ఏపీలోనూ షర్మిలను రాజకీయంగా యాక్టివ్ చేసే అవకాశం 


కాంగ్రెస్ హైకమాండ్ కూడా షర్మిలను పూర్తి స్థాయిలో ఏపీలో పార్టీ పునర్వైభవం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి  వెళ్లిపోయింది. మళ్లీ కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్ కు రావాలంటే... వైఎస్ఆర్ వారసుల్లో ఒకరు అయిన షర్మిల వల్లే సాధ్యమని అంచనా వేస్తున్నారు.  అందుకే ఈ ఎన్నికల్లో షర్మిలకు తెలంగాణలో పోటీ చేయడానికి సీటు ఇచ్చినా  .. తర్వాత జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో .. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరపున కీలక పాత్ర పోషించేలా చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.                            


వారంలో కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం పూర్తి 


దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుు కంచుకోటల్లాంటి రాష్ట్రాలు ఉండేవి. అందులో  ఏపీ కూడా ఒకటి. ఒక సారి అధికారం కోల్పోయినా.. మళ్లీ చేతికి అధికారం అందుతూ ఉండేది.కానీ.. రాష్ట్ర విభజన తర్వాత  ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి  రాలేకపోతున్నారు. ఆ పరిస్థితిని షర్మిల ద్వారా మార్చాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే వచ్చే వారంలో ష్రమిల పార్టీ విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.