Telangana politics :  తెలంగాణ రాజకీయాల్లో కనిపించని మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా పైకి జరుగుతున్న పరిణామాలు సూచనలు ఇస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ కన్నా తెలంగాణలో ఎక్కువ చర్చ జరుగుతోంది. దీనికి కారణం బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందన్న చర్చ  ప్రారంభం కావడమే. ఎన్నికలకు ఇంకా ఎంతో  సమయం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు పూర్తి  చేసుకుంటున్నాయి.  ఈ కారణంగా  బీజేపీ, టీడీపీ వేర్వేరుగా తమ అంతర్గత చర్చలను ప్రారంభించడంతో.. ఈ చర్చలకు.. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనకు ఏమైనా లింక్ ఉందా అన్న సందేహం రాజకీయవర్గాలకు వస్తోంది. 

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు

చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో తెలంగాణ టీడీపీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మొత్తం టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు  కాసాని జ్ఞానేశ్వర్ కే అప్పగించారు. ఎప్పుడైనా వారంతాాల్లో మాత్రమే టీడీపీ కార్యాకలాపాలపై దృష్టి పెడుతున్నారు చంద్రబాబు. అయితే హఠాత్తుగా ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లారు.  కాసాని జ్ఞానేశ్వర్ సహా కీలక నేతలతో మంతనాలు జరిపారు. ఇది ప్లాన్డ్ సమావేశమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లి రావడం.. ఆ తర్వాత తెలంగాణలో పొత్తులపై చర్చలు జరుగుతూండటంతో బీజేపీతో  పొత్తులపై బీజేపీ హైకమాండ్ పెట్టిన ప్రతిపాదనల్ని చంద్రబాబు వారి మందు ఉంచుతారని అంటున్నారు. 

పోస్టింగ్‌ల పేరుతో హోంశాఖ సెక్రటరీ సంతకం ఫోర్జరీ - ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిపై ఢిల్లీలో కేసులు !

బీజేపీ కార్యదర్శులతో బండి సంజయ్ భేటీ 

మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్  క్యాడర్ లోని పలు విభాగాల వారితో మాట్లాడుతున్నారు. కార్యదర్శులందరితో హైదరాబాద్‌లో సమావేశం పెట్టారు. త్వరలో సునీల్ బన్సల్ తెలంగాణ ప్రయటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నట్లుగా చెబుతున్నారు.  ఎన్నికల సన్నాహాలు అని చెబుతున్నారు కానీ.. ఇది టీడీపీతో పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకోవడమేనని ఆ ఆ పార్టీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. అయితే టీడీపీతో  పొత్తు ప్రశ్నే లేదని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. 

వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు   !

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీల చర్చల వేగం పెరగడం మాత్రం.. నిజంగానే రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించడానికేనని అంటున్నారు. బీజేపీ క్యాడర్ బీజేపీతో పొత్తు కోసం అంత సుముఖంగా లేదని చెబుతున్నారు. అయితే హైకమాండ్ చెబితే మాత్రం వ్యతిరేకించలేరు. బీజేపీకి ఇరవై కి మించిన స్థానాల్లో అభ్యర్థులు లేరు. చేరిన వాళ్లు కూడా ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే.. హైకమాండ్ భిన్నమైన ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వచ్చే కొద్ది రోజుల్లో చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.