పొడవాటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఆధునిక కాలంలో కాలుష్యం, ఒత్తిడి వంటి వాటివల్ల జుట్టు పొడవు పెరగడం లేదు, సరికదా విపరీతంగా రాలిపోతుంది. పొడవాటి జుట్టు కావాలనుకునేవారు కొన్ని చిట్కాలు పాటించాలి. జుట్టు పెళుసుగా మారి రాలిపోకుండా ఉండాలంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనే మందారం మొక్కను పెంచుకుంటే అవసరమైనప్పుడల్లా వాటి ఆకులను, పూలను జుట్టు కోసం ఉపయోగించుకోవచ్చు. మందార పువ్వులు, ఆకులతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకొని పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు.


జుట్టు రాలే సమస్య ఎక్కువ మందికే ఉంది. అలాంటివారు జుట్టు పెరుగుదల కోసం ముందుగా జుట్టు రాలే సమస్యను అడ్డుకోవాలి. జుట్టు రాలడం ఆగితేనే జుట్టు పొడవు పెరగడం మొదలవుతుంది. ముందుగా మందార ఆకులను, మందార పువ్వులను తీసుకొని మిక్సీలో మెత్తని పేస్టులా చేయండి. ఆ పేస్టులో కొబ్బరి నూనె కలపండి. ఆ మిశ్రమాన్ని వెంట్రుకల మొదళ్లకు తగిలేలా మాడుపై మర్దన చేయండి. గంట పాటు అలా ఉంచండి. తర్వాత తలస్నానం చేయండి. వారానికి ఇలా రెండుసార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు కూడా దీనివల్ల మాయమైపోతుంది.


మందార పువ్వులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, ఆ నీటితో తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది. అలాగే జుట్టు కూడా బలంగా మారుతుంది. ఉల్లిపాయలు, మందార ఆకులు కలిపి చేసే పేస్ట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఉల్లిపాయలను, మందార ఆకులను కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసి రసాన్ని పిండాలి. ఆ రసాన్ని తలకు బాగా పట్టించాలి. అరగంట పాటు అలా ఉంచాలి. తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కొన్ని నెలలకు జుట్టు ఒత్తుగా పెరగడం మొదలవుతుంది. ఒకటిన్నర కప్పు నీటిలో ఎండిన మందార పూలను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలోనే లావెండర్ నూనె, ఆలీవ్ నూనె, గ్లిజరిన్ కూడా వేసి వడకట్టి ఒక బాటిల్లో వేయాలి. అప్పుడప్పుడు దీన్ని తలపై స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. వేళ్ళతో మర్దన చేస్తూ ఉంటే అక్కడ రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు వేగంగా పొడవు పెరుగుతాయి. పట్టుకురుల్లా కాంతివంతంగా ఉంటాయి. నెలకు రెండు నుంచి మూడు సార్లు ఇలా చేసినా చాలు. మంచి ఫలితం ఉంటుంది. 


Also read: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.