RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం నేటి నుంచి (6 జూన్ 2023) ప్రారంభం అయింది, గురువారం (జూన్ 8) వరకు జరుగుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక సమావేశం ఇది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరుగుతున్న సమీక్షలో.. రెపో రేటు (repo rate), CRR, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి (GDP) వంటి అంశాలపై చర్చిస్తారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అంచనాలను గురువారం మధ్యాహ్న సమయంలో ప్రకటిస్తారు.
ఖరీఫ్ పంటపై ఎల్ నినో ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఆహార పదార్థాల ధరలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రుతుపవనాల పురోగతిపై కూడా ఆర్‌బీఐ సమీక్షిస్తుంది.
రెపో రేటు పెంచుతారా, తగ్గిస్తారా?
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి దిగి రావడంతో, గత రెండు సమావేశాల్లో రెపో రేటును పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి కూడా, రెపో రేటులో సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి మార్పు చేయదని, వడ్డీ రేటు పెంపు ఉండదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
గత ఏడాది కాలంలో, దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం (inflation) నేపథ్యంలో, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును ఆర్‌బీఐ 4.50 శాతం నుంచి 6.50 శాతానికి (250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం) పెంచింది. ఈ చర్యల ఫలితంగా, గతంలో 7 శాతం పైగా నమోదైన ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ నెలలో 5 శాతం లోపునకు చేరింది. ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయి అయిన 6 శాతం కంటే కింద ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం, వచ్చే నెలల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తుండడంతో రేట్లను పెంపులో ఇదే గరిష్ట స్థాయిగా చూడాలని, భవిష్యత్తులో ఈ రేటు తగ్గవచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
ఏప్రిల్‌లో ‘వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం’ (Retail Inflation) 4.7 శాతంగా నమోదైంది, ఇది 18 నెలల కనిష్ఠం. మే నెలలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పారు. మే నెలకు సంబంధించిన చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలను ఈ నెల 12న ప్రకటిస్తారు.
వడ్డీ రేట్ల పెంపు ఇకపై ఉండదని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు.
"CPI ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదలను అస్సలు ఆశించడం లేదు. వడ్డీ రేట్ల పెంపును పాజ్ చేయడానికి అవసరమైనంతగా ద్రవ్యోల్బణం తగింది. టోకు, చిల్లర ద్రవ్యోల్బణం రెండింటిలో తగ్గుదల నమోదైంది. కాబట్టి, వడ్డీ రేట్ల పెంపులో RBI ఇక విరామం తీసుకుంటుందని, రెపో రేటు పెరగదని నేను భావిస్తున్నాను" - మదన్ సబ్నవిస్
ఈ ఏడాది రెపో రేటు 25-50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని మదన్ సబ్నవిస్ అంచనా వేశారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే తగ్గింపు మొదలు కావచ్చని అన్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరో ఆసక్తికర కథనం: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది