Telangana Congress MP Aspirant Applications Completed: తెలంగాణలో (Telangana) రాబోయే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో హస్తం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఆశావహుల నుంచి ఎంపీ దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 306 దరఖాస్తులు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఆశావహుల్లో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, మహబూబాబాద్ నుంచి విజయాభాయ్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో వాళ్ల స్థానాల్లో వారి బంధువులు, సన్నిహితులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


ప్రముఖ స్థానాల్లో ఇలా


రేవంత్ రెడ్డి సీఎం కావడంతో  ఖాళీ అయిన మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సహా ప్రముఖ సిని నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. అలాగే, సీఎం సన్నిహితులు పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ లు  కూడా ఉన్నారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్ సభ స్థానం హాట్ సీట్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని సహా, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీనియర్ నేత వీహెచ్ సైతం అప్లికేషన్లు సమర్పించారు. అలాగే, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల ఎండీ వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ సైతం దరఖాస్తు చేశారు. భట్టి సతీమణి 500 కార్ల కాన్వాయ్ తో ఖమ్మం నుంచి భారీగా కార్యకర్తలతో తరలివచ్చి మరీ గాంధీ భవన్ లో దరఖాస్తు సమర్పించారు.


హాట్ టాపిక్ అదే


అటు, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్ డైరెక్టర్ గా ఉండి అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు సైతం మొక్కి వార్తల్లో నిలిచారు. గతంలో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించినా.. కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. కాగా, రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే ఆయన్ను ఆ పోస్టు నుంచి బదిలీ చేశారు. అయితే, లాంగ్ లీవ్ లో ఉన్న ఆయన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ కు దరఖాస్తు సమర్పించారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. 


Also Read: Konda Surekha: 'కవిత స్కాంలో ఇరుక్కుని లిక్కర్ రాణిగా మారారు' - బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు