Medigadda dam safty Report : మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రిట్ కూడా తొలగిపోయిందని, బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటినెన్స్.. మొత్తం ఈ నాలుగు విషయాల్లో వైఫల్యం చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది. మొత్తం 43 పేజీల్లో సమగ్రమైన నివేదికను కేంద్ర కమిటీ ఇచ్చింది.
బ్యారేజీని ఇప్పుడల్లా నీటితో నింపలేరు !
బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం.
పిల్లర్లు కుంగడానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పిన కారణాలు
+ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం
+బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది
+ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు
+బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది
+బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు
+బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం
+బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదు
+ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది
అన్నారం సుందిళ్ల బ్యారేజీలపైనా ప్రభావం
అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది.