Master Plan Tension For BRS :   మాస్టర్ ప్లాన్ ఈ పేరు వింటేనే.. బీఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో చివరికి  ఆ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ ఇతర మున్సిపాలిటీలకూ రెడీ ఉన్నారు. అక్కడ కూడా ఆందోలనలు పెరిగే అవకాశాలు కనిపించడంతో ముందస్తుగానే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిర్ణయిస్తున్నారు. శుక్రవారం  మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని జగిత్యాల మున్సిపాలిటీ తీర్మానం చేసింది. మున్సిపల్ ఛైర్మన్ శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన  పాలకవర్గం..  తీర్మానం కాపీని ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది. 


రైతులకు ఇబ్బంది కలిగించే ఏ పనీ చేయబోమన్న  జగిత్యాల మున్సిపల్ చైర్మన్ 


తాము ప్రజల వైపే ఉంటామని .. రైతులు ప్రతిపక్షాల వలలో పడొద్దని మున్సిపల్ చైర్మన్ శ్రావణి కోరారు.  రైతులకు ఆమోదయోగ్యం కానిది ఏదైనా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు. మాస్టర్ ప్లాన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. 1996లో  కాంగ్రెస్ హయాంలో తయారు చేసిన  మాస్టర్ ప్లాన్  తప్పుల తడకగా ఉందన్నారు.  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాల టౌన్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.  మాస్టర్ ప్లాన్ పై చర్చించడానికి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని..ఈ విషయం జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో చెప్పాలన్నారు.  ఇకనైనా  జీవన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టడం ఆపాలని హితవు పలికారు.


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రణాళికను రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపాలిటి తీర్మానం
 
మరో వైపు కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  కామారెడ్డి  మున్సిపల్  కౌన్సిల్ సమావేశం ఇవాళ నిర్ణయం తీసుకుంది.  ఈ  విషయమై  మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా  నిర్వహించారు.   కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  విలీన గ్రామాలకు  చెందిన 9 మంది  కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని నిన్నటికి డెడ్ లైన్ విధించారు.  ఇద్దరు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు  రాజీనామాలు చేశారు. అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయలేదు.  అయితే ఈ తరుణంలో  ఇవాళ కామారెడ్డి మున్సిపల్ సమావేశం ఏర్పాటు  చేశారు. ఈ సమావేశంలో   కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  మున్సిపల్  పాలకవర్గం తీర్మానం చేసింది. 


వ్యతిరేకత ఉన్న పట్టణాల మాస్టర్ ప్లాన్ల రద్దుతో  బీఆర్ఎస్ నేతలకు ఊరట 


మాస్టర్ ప్లాన్లు రద్దు చేయడంతో రైతులు శాంతించారు. ఉద్యమాలు నిలిపివేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తీసుకు వచ్చిన మాస్టర్ ప్లాన్లను రైతుల ఆందోళనతో నిలిపివేయడంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై అధికార వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.  కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలా లేకపోతే ప్రస్తుత పరిస్థితి కొనసాగించాలా అనేది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా చేసే అవకాశం ఉంది.