కోవిడ్ భయం అందరిలో మళ్ళీ మొదలైంది. కొత్త వేరియంట్ల రూపంలో వచ్చి అందరినీ భయపెట్టేస్తోంది. ఇప్పుడు కోవిడ్ కి సంబంధించి తాజా అధ్యయనం ఒకటి మరింత గుబులు పెట్టేస్తుంది. అదేంటంటే కోవిడ్ సోకిన తర్వాత కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని పరిశోధకులు తాజాగా హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రచురించిన కార్డియోవాస్కులర్ రీసెర్చ్ లో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనంలో దాదాపు 1,60,000 మంది పాల్గొన్నారు. కోవిడ్ సోకని వారితో పోలిస్తే కరోనా బారిన పడిన వారిలో అనేక హృదయ సంబంధ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.


కోవిడ్ తగ్గిందని అనుకోవద్దు 


దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్ హృదయ సంబంధ వ్యాధులని ఎక్కువ చేస్తుందని తెలిపారు. తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కోవిడ్ రోగులని కనీసం ఏడాది పాటు పర్యవేక్షించాలని పరిశోధనలు సూచిస్తున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు వాంగ్ చెప్పుకొచ్చారు. వ్యాధి సోకని వ్యక్తులతో పోలిస్తే కోవిడ్ రోగులు మరణించే అవకాశం మొదటి మూడు వారాల్లో 81 రెట్లు అధికంగా ఉందని అన్నారు. ఈ తీవ్రత 18 నెలల తర్వాత కూడా ఐదు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు.


ఈ అధ్యయనం ప్రకారం తీవ్రమైన కరోనా వైరస్ బారిన పడిన రోగులు హృదయ సంబంధ వ్యాధులని అభివృద్ధి చేసే అవకాశంతో పాటు కొన్ని తీవ్రమైన కేసుల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉందని తేలింది. మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌తో పాటు స్వల్ప, దీర్ఘకాలిక హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ అధ్యయనం కరోనా మొదటి వేవ్ సమయంలో జరిపిందని వాంగ్ తెలిపారు. దీని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.


ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ BF.7 చైనాతో పాటు పలు దేశాలలో విజృంభిస్తోంది. భారత్ లోని ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదని రోజువారీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. శుక్రవారం 134 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కోవిడ్ బారిన పడి మరో 170 మంది కోలుకున్నట్టు తెలిపారు. అటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ చైనా, జపాన్ లో ఎక్కువగా ఉంది. అక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలు సంభవించనప్పటికీ కోవిడ్ ప్రమాదం మాత్రం పోలేదని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు.


అందుకే అందరూ బయటకి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. బయట నుంచి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం