Prakasham Crime News: ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు రాత్రి ఇసుక పని కోసం ఇంటికి వెళ్లాడు. వేకువజామున ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో అదుపుతప్పి బోరుబావిపై పడిపోయాడు. ఈ క్రమంలోనే బోర్ హ్యాండిల్ యువకుడి కడుపులోకి చొచ్చుకెళ్లింది. విషయం గుర్తించిన స్థానికులు దాన్ని వెల్డింగ్ మిషన్ తో కట్ చేశారు. కొంత భాగం కడుపులో ఉండడంతో అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. 


అసలేం జరిగిందంటే..?


ప్రకాశం జిల్లా కనిగిరి రాజీవ్ నగర్ లో గురువారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి ఇందిరా కాలనీకి చెందిన 18 ఏళ్ల కంటు నాగరాజు బుధవారం రాత్రి ఇసుక పనికి వెళ్లి తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. రాజీవ్ నగర్ వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న చేతి పంపును ఢీకొట్టారు. దీంతో బోర్ హ్యాండిల్ ఆయన కడుపులోకి చొచ్చుకెళ్లింది. విషయం గుర్తించిన స్థానికులంతా అక్కడకు వచ్చారు. అతడి కడుపులోంచి దాన్ని ఎలా తీయాలా అని చాలా ఆలోచించారు. చివరకు వెల్డింగ్ మిషన్ ద్వారా చేతి పంపును కోసేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న వెల్డింగ్ దుకాణ యజమానికి చెప్పి దాన్ని తొలగించారు.      


అయితే అప్పటికే కడుపులో కాస్త భాగం ఇరుక్కుపోవడంతో.. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి క్షతగాత్రుడి కడుపులోంచి రాడ్డును తొలగించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సదురు యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే కడుపులో బోరు హ్యాండిల్ ఇరుక్కుపోవడాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తమ కుమారుడికి ఏం జరగడకూడదని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. 


వారం రోజుల క్రితం కడపలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి


కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపై వేగంగా వచ్చిన టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే  ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గొరిగెనూరు గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, ధర్మాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బారెడ్డి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కూలీలను ఢీకొట్టిన టిప్పర్ పొలాల్లోకి దూసుకెళ్లడంతో అందులోని డ్రైవర్ కూడా మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ ఉప్పలపాడు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాద స్థలంలో  మృతదేహాలు ఛిద్రమై గుర్తు పట్టలేని స్థితిలో రోడ్డు పై పడి ఉన్నాయి. ప్రమాద స్థలంలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ మృతుల కుటుంబాలల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.